సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మీద సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. సీజేఐ ఇటీవల అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదం గురించి చేసిన వ్యాఖ్యల మీద రాంగోపాల్ యాదవ్ వివాదాస్పదంగా మాట్లాడారు. తర్వాత పరిస్థితిని గమనించి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
రామజన్మభూమి బాబ్రీమసీదు కేసులో తీర్పు వెలువరించేటప్పుడు తాను దేవుణ్ణి ప్రార్థించానని చంద్రచూడ్ చెప్పారు. దానిగురించి అడిగినప్పుడు ఎస్‌పి నేత రాంగోపాల్ యాదవ్ సీజేఐని అవమానించేలా వ్యాఖ్యలు చేసారు. ‘‘దెయ్యాలకి ప్రాణం పోసినా అవి మళ్ళీ దయ్యాలే అవుతాయి, ఆ న్యాయాన్నే పాటిస్తాయి. ఇప్పుడా దయ్యాలు ఎక్కడున్నాయి? వదిలెయ్యండి. అలాంటి మనుషులు అలాంటి మాటలే చెబుతూ ఉంటారు’’ అని రాంగోపాల్ వ్యాఖ్యానించారు. రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే అవమానిస్తున్నారంటూ వెంటనే తీవ్రమైన విమర్శలు వచ్చాయి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కొద్దిరోజుల క్రితం తన స్వస్థలం పుణేలో మాట్లాడుతూ, అయోధ్య వివాదం కేసులో తీర్పు విషయంలో తన అనుభవాలను పంచుకున్నారు. ఆ తీర్పు ఇవ్వడానికి మూడు నెలల వ్యవధి పట్టిందనీ, ఆ సమయంలో సమస్య పరిష్కారం కోసం తాను రోజూ ప్రార్థన చేసేవాడినని చెప్పారు. విశ్వాసం కలిగి ఉండడం ముఖ్యం అని స్పష్టంచేసారు. అలాంటి విశ్వాసమే తనకు ఆ తీర్పు సమయంలో మార్గదర్శకంగా నిలిచిందని వివరించారు.
‘‘నేను దైవం ముందు కూర్చుని ఆ సమస్యకు పరిష్కారం ఆయనే కనుగొనాలని చెప్పాను. నన్ను నమ్మండి. మీకు విశ్వాసం ఉంటే దైవం తప్పక మీకు మార్గం చూపుతాడు’’ అని చెప్పారు. సంక్లిష్ట సమయాల్లో సమాధానాలు కనుగొనడానికి నమ్మకం ముఖ్యం అనే ఆయన ఆధ్యాత్మిక విశ్వాసం ఆ మాటల ద్వారా వెల్లడయింది. అంతేకాదు, చరిత్రాత్మక తీర్పు ఇచ్చే సమయంలో తన మానసిక పరిస్థితి గురించి ఆయన వివరించారు.
రామజన్మభూమి-బాబ్రీ కట్టడం వివాదం, దానికున్న చారిత్రక, మత, రాజకీయ దృక్కోణాల దృష్ట్యా భారతదేశ న్యాయవ్యవస్థలో అత్యంత కీలకమైన, సున్నితమైన కేసుల్లో ప్రధానమైనది. 2019 నవంబర్‌లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆ కేసులో తుదితీర్పు వెలువరించింది. ఆ ధర్మాసనంలో డివై చంద్రచూడ్ కూడా ఉన్నారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించాలని ఆ తీర్పు స్పష్టం చేసింది.
తన వ్యాఖ్యలపై తీవ్రవిమర్శలు రావడంతో సమాజ్‌వాదీ నేత రాంగోపాల్ యాదవ్ వెంటనే వివరణ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించారంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేసారు. సీజేఐ చంద్రచూడ్ మీద వ్యాఖ్యలు చేయాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. తను మాట్లాడింది చంద్రచూడ్ వ్యాఖ్యల మీద కాదని, బహ్రెయిచ్ హింసాకాండ గురించనీ చెప్పుకొచ్చారు.
‘‘నన్ను ఎవరూ సీజేఐ గురించి ఏమీ అడగలేదు. ప్రధాన న్యాయమూర్తి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు. ఆయన గురించి నేను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. నన్ను బహ్రెయిచ్ ఘటన గురించి అడిగారు. దానికి మాత్రమే జవాబిచ్చాను’’ అంటూ వివాదాన్ని చల్లార్చేందుకు రాంగోపాల్ యాదవ్ ప్రయత్నించారు.
అయితే సామాజిక మాధ్యమాల్లో రాంగోపాల్ వివరణ మీద కూడా తీవ్రవిమర్శలు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన వత్తిడిని తట్టుకోలేక ఆయన మాటమార్చాడంటూ దుయ్యబడుతున్నారు.