భారతీయ మల్లయోధురాలు సాక్షి మాలిక్ స్వీయజీవిత చరిత్ర ‘విట్నెస్’ కొద్దిరోజులక్రితం విడుదలైంది. ఆ పుస్తకంలో పేర్కొన్న కొన్ని అంశాలు వివాదాస్పదమయ్యాయి. రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతకం సాధించిన మొదటి భారతీయురాలు సాక్షి మాలిక్ తన పుస్తకంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
ప్రత్యేకించి, సాక్షిమాలిక్ తన పుస్తకంలో వినేష్ ఫోగాట్, బజరంగ్ పూనియా 2023 ఆసియా క్రీడల ట్రయల్స్‌కు గైర్హాజరవడానికి కారణం వారి దురాశేనని ఆరోపించింది. ఆ నిర్ణయం బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా మొదలుపెట్టిన రెజర్ల ఉద్యమం స్ఫూర్తిని దెబ్బతీసిందని సాక్షి అభిప్రాయపడింది. ‘‘ట్రయల్స్‌కు గైర్హాజరు అవాలని వారు తీసుకున్న నిర్ణయం సానుకూల ప్రభావం చూపలేదు, అది వారు చేపట్టిన ఆందోళనపై గౌరవాన్ని పూర్తిగా తగ్గించివేసింది. ఆందోళనలో వారిని సమర్ధించిన చాలామంది, ఆ ఆందోళన వారి వ్యక్తిగత లబ్ధి కోసం చేపట్టారని నమ్మేలా చేసింది’’ అని సాక్షి రాసుకొచ్చింది.
సాక్షి మాలిక్ జీవితచరిత్రలో కొన్ని ప్రధానమైన విషయాల ప్రస్తావన, కొన్ని ప్రధానమైన ఆరోపణలూ ఉన్నాయి. అవేంటో చూద్దాం.
1. ట్రయల్స్‌కు గైర్హాజరు: బజరంగ్ పూనియా, వినేష్ ఫోగాట్ కొందరు వ్యక్తుల ప్రభావానికి లోబడి 2023 ఆసియన్ గేమ్స్ ట్రయల్స్‌కు గైర్హాజరు అయ్యారు. సాక్షిని కూడా గైర్హాజరవాలని అడిగారు కానీ ఆమె నిరాకరించింది. బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో మొదలుపెట్టిన ఉద్యమానికి మొదట్లో విస్తృతంగా మద్దతు లభించింది. కానీ ట్రయల్స్‌కు వారిద్దరి గైర్హాజరు ఆ ఉద్యమాన్ని దెబ్బతీసింది.
2. జంతర్‌మంతర్ నిరసన: బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేయాలన్న ఆలోచన తనది కాదని సాక్షి మాలిక్ వెల్లడించింది. ‘‘నిరసనలకు 3-4రోజుల ముందు బబితా ఫోగట్ నాకు ఫోన్ చేసింది, నేను వస్తున్నానో లేదో కనుక్కోడానికి ఆమె కాల్ చేసింది’’ అని సాక్షి రాసుకొచ్చింది. ఆమె చెబుతున్న ప్రకారం తీర్థ్ రాణా అనే బీజేపీ నాయకుడు రెజ్లర్ల ఆందోళనకు అనుమతులు సంపాదించాడు. వారి లక్ష్యం బ్రిజ్‌భూషణ్‌ను పదవీచ్యుతుణ్ణి చేయడం, ఆందోళన చేస్తున్న రెజ్లర్లలో ఒకరికి ఆ పదవి దక్కేలా చేయడం.
3. ఒలింపిక్స్‌లో వినేష్ ఇబ్బందులు: పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగాట్‌కు వ్యతిరేకంగా కుట్ర జరిగిందన్న పుకార్ల గురించి సాక్షి మాలిక్ తన రచనలో వివరించింది. ‘‘వినేష్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రా జరగలేదు’’ అని స్పష్టంగా తేల్చిచెప్పింది. ఒలింపిక్స్ సమయంలో బరువు కారణంగా వినేష్ ఎదుర్కొన్న సమస్యలు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నియమావళిలో ఎదురయ్యే సమస్యలేనని తేల్చి చెప్పింది.
4. బాల్యంలో వేధింపులు: సాక్షి మాలిక్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న దారుణమైన ఘటన గురించి రాసుకొచ్చింది. తన చిన్నతనంలో ఒక ట్యూషన్ టీచర్ తనను వేధించేవాడని వెల్లడించింది. ‘‘ఆయన తన ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు రమ్మనేవాడు, కొన్నిసార్లు నన్ను తాకడానికీ ప్రయత్నించేవాడు’’ అని గుర్తు చేసుకుంది. అతని వేధింపుల గురించి కుటుంబ సభ్యులకు చెప్పడానికి ధైర్యం సరిపోలేదట.
ఫోగాట్ సోదరీమణుల స్పందనలు:
సాక్షిమాలిక్ ఆరోపణలకు, అందరూ ఊహించినట్లే, ఫోగాట్ కుటుంబం నుంచి తీవ్రమైన స్పందనలు వచ్చాయి. బబితా ఫోగాట్ సోదరి గీతా ఫోగాట్ తన అక్కను సమర్థించడానికి ముందుకొచ్చింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షురాలు కావాలన్న వ్యక్తిగత లక్ష్యం ఏదీ తన సోదరి బబితకు లేదని చెప్పింది. ‘‘చాలామంది క్రీడాకారులు తమ అజెండాలను ముందు పెట్టడానికో, తమ రాజకీయాలకు పదును పెట్టడానికో బబితా ఫోగట్ పేరు మీద ప్రయత్నిస్తూంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెబుతున్నా. రెజ్లింగ్‌లో కానీ, రాజకీయాల్లో కానీ బబిత సాధించిన విజయాలు ఆమె కష్టపడి పరిశ్రమించి, నిజాయితీగా సంపాదించుకున్నవే’’ అని గీత సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ‘‘ఫెడరేషన్ ప్రెసిడెంట్ కావాలన్న దురాశ ఎవరికి ఉందో అందరికీ తెలుసు. నిజాన్ని ఇబ్బంది పెట్టడం సాధ్యమే, ఓడించడం మాత్రం సాధ్యం కాదు’’ అంటూ రాసుకొచ్చింది.
సాక్షి మాలిక్ ఆరోపణల్లో ప్రధాన వ్యక్తి వినేష్ ఫోగాట్ తనదైన శైలిలో స్పందించింది. ఓ సమావేశంలో మాట్లాడుతూ ‘‘మనం ఎలాంటి దురాశ గురించి మాట్లాడుతున్నాం? తోటి క్రీడాకారుల గురించి మాట్లాడడం, గళమెత్తడం దురాశ అవుతుందంటే అది మంచి దురాశే కదా’’ అని చెప్పింది. ఇదే అంశం గురించి సోషల్ మీడియాలో నర్మగర్భంగా స్పందించింది. ‘‘మీరు వినే ప్రతీ విషయాన్నీ నమ్మకండి. ప్రతీ కథకూ మూడు కోణాలుంటాయి. మనది, వారిది, నిజమైనది’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
బబిత తండ్రి, ద్రోణాచార్య పురస్కార గ్రహీత మహావీర్ ఫోగాట్ ఈ వివాదంలో తనవంతు అగ్గి రాజేసారు. సాక్షి మాలిక్ ఆరోపణల వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందని ఆయన ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు ఆమె ఆడుతోందన్నారు. ‘‘హూడా-ప్రియాంకాగాంధీల భాషనే సాక్షి మాట్లాడుతోంది’’ అన్నారు. బబితకు రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షురాలు అవాలన్న కోరిక లేదని, ఆమె కేవలం తోటి రెజ్లర్లకు అండగా నిలిచిందని చెప్పుకొచ్చారు.
హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్‌లాల్ బరోలీ ఈ ఆరోపణల వల్ల పెరిగిన ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నించారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోకుండా సహనం వహించాలని సూచించారు. ‘బబితా ఫోగాట్ నిజాయితీ కలిగిన, కష్టపడి పనిచేసే క్లీన్‌ఇమేజ్ ఉన్న నాయకురాలు’ అని అభిప్రాయపడ్డారు. ‘‘నేనూ ఓ క్రీడాకారుణ్ణే. తోటి క్రీడాకారులు అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతికూల ఆరోపణలను వదిలిపెట్టేయండి, మంచి ఉద్దేశాలతో ముందడుగు వేయండి’’ అని చెప్పారు.