ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు దిగజారిపోయాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ పాలనలో మహిళలకు భరోసా ఇచ్చామన్న జగన్, దిశ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అత్యాచార బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోద్బలం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లాలో పర్యటించిన వైఎస్ జగన్, ఓ ఉన్మాది చేతిలో దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన సహాన కుటుంబసభ్యులను పరామర్శించారు. తాడేపల్లి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లిన జగన్, మార్చురీలో సహాన మృతదేహానికి నివాళి అర్పించారు. అనంతరం సహాన కుటుంబ కుటుంబసభ్యులను ఓదార్చారు.
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్, ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు నవీన్ టీడీపీకి చెందిన వాడు అని ఆరోపించారు. చంద్రబాబుతోనూ నిందితుడు ఫొటోలు దిగిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేందుకు సహాన ఘటనే నిదర్శమని పేర్కొన్నారు.
గుంటూరులో సహాన కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం, వైఎస్ఆర్ జిల్లా బద్వేలుకు జగన్ బయల్దేరి వెళ్లారు.