బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనడానికి రష్యాలోని కజాన్ వెళ్ళిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అక్కడ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు నాయకులూ మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల గురించి చర్చించారు. పశ్చిమాసియాలో ఘర్షణలు నానాటికీ తీవ్రతరం అవుతుండడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేసారు. దేశాల ఘర్షణల్లో సాధారణ పౌరులకు ఎలాంటి హానీ జరగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రధాని సమావేశాల వివరాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వివరించారు. ‘‘చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ఉద్రిక్త పరిస్థితులను నివారించుకోవాలని మోదీ స్పష్టం చేసారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి సామరస్యతలను నెలకొల్పాల్సిన అవసరం ఉందని ఇరాన్ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. దానికోసం భారత్ ప్రయత్నించాలన్నారు. ఘర్షణ పడుతున్న ఇరుపక్షాలతోనూ భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయని ఆయన గుర్తుచేసారు’’ అని మిశ్రీ చెప్పారు. అప్ఘానిస్తాన్‌లో పరిస్థితి గురించి కూడా వారిద్దరూ చర్చించారని వెల్లడించారు.
బ్రిక్స్, షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సంస్థల్లో ఇరాన్‌కు అవకాశం కల్పించడంలో భారత్ కీలకపాత్ర వహించిందని ఇరాన్ అధ్యక్షుడు చెప్పారు. అదేవిధమైన పరస్పర సహకారాన్ని వివిధ వేదికల్లో పంచుకోవాలని నిర్ణయించారు. మోదీ, పెజెష్కియన్ చర్చలు ఫలవంతమయ్యాయి. ఇరాన్‌కు తొమ్మిదవ అధ్యక్షుడిగా పెజెష్కియన్ గెలిచాక వారిద్దరూ కలవడం ఇదే మొదటిసారి.
మోదీ, పెజెష్కియన్ ప్రధానంగా చాబహార్ ఓడరేవు, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ గురించి చర్చించారు. ఇవాళ భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జింపింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. 2020 గాల్వన్ ఘర్షణల తర్వాత ఇరుదేశాల అధినేతలూ ముఖాముఖి ద్వైపాక్షికంగా చర్చలు జరపడం ఇదే మొదటిసారి కానుంది.