కదిరి నుంచి పులివెందులకు వెళుతున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి, దాదాపు 30 అడుగుల లోయలో పడింది. దీంతో బస్సులోని 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
కదిరి నుంచి పులివెందులకు వెళ్ళే బస్సు డంపింగ్ యార్డ్ వద్దకు చేరుకోగా, ఎదురుగా వచ్చే వాహనాలకు దారి ఇచ్చేందుకు గాను ఆర్టీసీ బస్సు డ్రైవర్ బ్రేకులు వేశాడు. కానీ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్లను ఢీకొడుతూ లోయలో పడింది. సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.