జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో నిన్న రాత్రి దీపావళి వేడుకలు జరుపుకోడానికి హిందూ విద్యార్ధులు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ముస్లిం విద్యార్ధులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకుని పాలస్తీనా జిందాబాద్ అంటూ నినాదాలు చేసారు.
జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న హిందూ విద్యార్ధులు మంగళవారం రాత్రి ‘జ్యోతిర్మయ 2024’ పేరిట కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. త్వరలో రాబోతున్న దీపావళి సందర్భంలో, పండుగ సెలవులకు వెళ్ళబోయే ముందు కొన్ని విద్యార్ధి సంఘాలు, రాష్ట్రీయ కళామంచ్ కళాకారులతో ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు, పాటల పోటీలు నిర్వహించారు. వేల సంఖ్యలో దీపాలు వెలిగించుకున్నారు. అయితే క్యాంపస్‌లోని ముస్లిం విద్యార్ధులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అల్లాహో అక్బర్ అంటూ ఇస్లామిక్ నినాదాలు చేసారు. దాంతో విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శాంతియుతంగా జరుగుతున్న దీపావళి వేడుకల కార్యక్రమాన్ని ముస్లిం విద్యార్ధులు అడ్డుకుని నారా-ఎ-తక్బీర్ అంటూ నినాదాలు చేసారు. అంతేకాదు, చూపరులకు దిగ్భ్రాంతి కలిగించేలా పాలస్తీనా జిందాబాద్ అంటూ నినాదాలు చేసారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న వేడుకలను రాజకీయం చేసి, అతివాద నినాదాలతో క్యాంపస్‌ను హోరెత్తించారు. వెలుగుల పండుగ, ఐక్యతను చాటే వేడుకగా మొదలైన కార్యక్రమం ముస్లిం విద్యార్ధుల ప్రతిఘటన, ఆందోళనలతో వేర్పాటువాదాన్ని పులుముకుంది. పాలస్తీనా నినాదాలతో అంతర్జాతీయ రాజకీయ రంగు పూసుకుంది.
అక్కడితో ఆగని ముస్లిం విద్యార్ధులు వెంటనే సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు. విశ్వవిద్యాలయం ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, హిందూ ముస్లిముల మధ్య ఘర్షణలు జరిగిపోతున్నాయని, హిందూ విద్యార్ధులు జైశ్రీరామ్ నినాదాలు చేస్తూ ముస్లిం విద్యార్ధులను రెచ్చగొడుతున్నారనీ దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఉత్తరభారతదేశంలో, రాముడు పధ్నాలుగేళ్ళ వనవాసం పూర్తిచేసుకుని అయోధ్య వెళ్ళే సందర్భంలో దీపావళి పండుగ జరుపుకుంటారు. అలాంటి సందర్భంలో పలికే జైశ్రీరామ్ నినాదాలకు సైతం రాజకీయ రంగు పులిమారు.
జామియా మిలియా ఇస్లామియాలో హిందూ పండుగల నిర్వహణను అడ్డుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది మార్చిలో హోలీ వేడుకలను కూడా ముస్లిం విద్యార్ధులు అడ్డుకున్నారు. ‘రంగోత్సవ్’ పేరిట హిందూ విద్యార్ధులు వేడుక చేసుకుంటుంటే దాన్ని అడ్డుకుని, ఘర్షణలు సృష్టించారు. ఆ సందర్భంలోనే ఒక ముస్లిం విద్యార్థి తన ఎక్స్ ఖాతాలో ‘‘అవిశ్వాసుల పండుగల్లో పాల్గొనడానికి అనుమతి లేదని హడీత్లు చెబుతున్నాయి. భారతదేశంలో హిందువులు ముస్లిములను అణగదొక్కుతూ, కేవలం బీఫ్ తిన్నందుకు ముస్లిములను సజీవదహనాలు చేస్తుంటే, ఇంకా వారితో కలిసి వేడుకలు జరుపుకుంటారా’’ అని రాసుకొచ్చాడు.
పాలస్తీనా అనుకూల సెంటిమెంట్లు కూడా జామియా మిలియా క్యాంపస్‌లో కొత్త కాదు. 2023 అక్టోబర్‌లో జామియాలోని ఒక విద్యార్ధి బృందం, హమాస్ ఉగ్రవాద సంస్థకు మద్దతు పలుకుతూ బ్యాడ్జిలు ధరించారు. పాలస్తీనాను విముక్తం చేయండి, ఇజ్రాయెల్ డౌన్‌డౌన్ అంటూ హ్యాష్‌టాగ్‌లతో సోషల్‌మీడియాలో హల్చల్ చేసారు, క్యాంపస్‌లో ర్యాలీలు నిర్వహించారు.
హిందూ పండుగలు చేసుకోవడం ఇస్లాం ప్రకారం నిషిద్ధం అనే కారణం చూపిస్తూ హిందూ విద్యార్ధుల వేడుకల మీద దాడులకు పాల్పడడం జామియా మిలియా ఆవరణలో సర్వసాధారణమైపోయింది. హనుమజ్జయంతి, శ్రీరామ నవమి, దసరా నవరాత్రులు, దీపావళి, సరస్వతీ పూజ… ఇలా ఏ వేడుక చేసుకోడానికి ప్రయత్నించినా ముస్లిం విద్యార్ధులు రచ్చ చేయడం, రాళ్ళు రువ్వడం, తగులబెట్టడం, ధ్వంసం చేయడం ప్రతీయేటా పరిపాటిగా మారింది. ఏటికేటా అటువంటి దాడుల సంఖ్య, దాడుల తీవ్రత పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది.