బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రం తీవ్ర వాయుగుండంగా బలపడింది. దీంతో ఈ రోజు తుపానుగా, రేపు తెల్లవారుజామున తీవ్ర తుపానుగా రూపాంతరం చెందవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తీవ్ర తుపానుకు ‘దానా’గా పేరుపెట్టారు. దానా ప్రభావం ఉన్న ఏపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను ఐఎండీ అప్రమత్తం చేసింది.ఈ తుపాను ప్రభావం ఏపీ పై పెద్దగా ఉండకపోవచ్చని పలువురు వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం లోపు పూరీ (ఒడిశా), సాగర్ ద్వీపం (పశ్చిమ బెంగాల్) మధ్యలో తీరం దాటే అవకాశముంది. ప్రస్తుత అంచనా ప్రకారం ఒడిశా, పశ్చిమబెంగాల్, స్థానిక పరిస్థితుల వల్ల గమనం మార్చుకుంటే బంగ్లాదేశ్ వైపు వెళ్లొచ్చు. దీనిప్రభావంతో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.
తమిళనాడు వ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వానలు పడే అవకాశముంది.