విశాఖపట్నం మాజీ ఎంపీ, వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు ఎంవివి సత్యనారాయణ మెడకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయనకు సంబంధించిన సంస్థల్లో సోదాలు నిర్వహించడంపై ఈడీ తాజాగా ప్రకటన చేసింది. ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా అక్టోబర్ 19న ఐదుచోట్ల సోదాలు చేసామని ఈడీ ప్రకటించింది.
ఎండాడలోని హయగ్రీవ ఫామ్స్ డెవలపర్స్‌కు 2008లో ప్రభుత్వం తక్కువ ధరకు కేటాయించింది. ఆ భూమిలో వృద్ధులు, అనాధలకు కాటేజీలు నిర్మించాల్సి ఉంది. 2010లో ఆ భూమి కోసం హయగ్రీవ సంస్థ రూ.5.63 కోట్లు చెల్లించింది. రిజిస్ట్రేషన్ నాటికి ఆస్తి విలువ రూ.30కోట్ల పైనే ఉంది. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ.200కోట్లు పైగానే ఉంది. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, మేనేజింగ్ పార్టనర్ గద్దె బ్రహ్మాజీ మోసపూరితంగా ఆ ప్రాజెక్టును స్వాధీనం చేసుకున్నారు. తప్పుడు పత్రాలతో బినామీ లావాదేవీలు నిర్వహించారు. 2021 నుంచీ ఆ భూమిని ప్లాట్లుగా విభజించి పలువురు వ్యక్తులకు తప్పుడు పత్రాలతో విక్రయించి రూ.150 కోట్లకు పైగా సంపాదించారు అని ఈడీ తమ ప్రకటనలో వెల్లడించింది.
ఈడీ సోదాల్లో 3వందలకు పైగా స్థిరాస్తుల విక్రయ దస్తావేజులు ఎంవీవీ సత్యనారాయణ, గద్దె బ్రహ్మాజీ, వారి కుటుంబ సభ్యుల పేర్లమీద లభించాయి. ఇంకా బినామీ పట్టాదారు పాసుపుస్తకాలు, డిజిటల్ పరికరాలు, వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని ఈడీ వెల్లడించింది.