బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. భౌగోళికంగా యుద్ధ భయాలు కమ్ముకోవడంతో పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్ల నుంచి మెటల్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం, తాజాగా ఇరాన్ కూడా హెచ్చరికలు చేయడంతో పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్లను వీడుతున్నారు. దీంతో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.
తాజాగా 10 గ్రాముల బంగారం ధర రూ.80500 దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్వచ్ఛమైన బంగారం 2739 అమెరికా డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో ఔన్సు 1600 డాలర్లు ఉండగా, జనవరికి రూ.2వేల డాలర్లకు చేరింది. తాజాగా 2739 డాలర్ల రికార్డు ధరకు చేరింది. వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. కిలో వెండి లక్ష రూపాయలకు చేరింది.
డాలరుతో రూపాయి మారకం విలువ 84 దాటిపోయింది. ముడిచమురు ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు లోహ మార్కెట్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు.