జాతీయ డ్రోన్ సదస్సుకు రంగం సిద్దమైంది. రెండు రోజుల పాటు జరిగే జాతీయ డ్రోన్ సదస్సును మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాసేపట్లో ప్రారంభించనున్నారు. ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన 3 వేలకుపైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. అమరావతిని డ్రోన్ తయారీకి రాజధానిగా మార్చేందుకు ఈ సదస్పు పునాది వేయనుందని అధికారులు చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ మినహా మరెక్కడా ఇలాంటి సదస్సు జరగలేదని వారు పేర్కొన్నారు.
డ్రోన్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. అనేక రంగాలకు డ్రోన్లు విస్తరిస్తున్నాయి. వ్యవసాయం, రక్షణ రంగం, మెడికల్, రవాణా, సరకుల సరఫరా ఇలా అనేక రంగాలకు డ్రోన్ సేవలు అందుతున్నాయి. రాబోయే పదేళ్లలో భారత్‌ను డ్రోన్ తయారీకి హబ్‌గా మార్చడంలో ఈ సదస్సు కీలకంగా మారనుంది. డ్రోన్ తయారీదారులు, వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగంపై పలువురు కీలక ప్రసంగాలు చేయనున్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్నాయుడు సహా పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు.
ఇవాళ సాయంత్రం విజయవాడ బెరం పార్కు వద్ద 5 వేల డ్రోన్లతో పలు ఆకృతులు ప్రదర్శించనున్నారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రదర్శన నిర్వహిస్తారు. దాదాపు లక్ష మంది వీక్షకులు పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు.