మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో కనీసం ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని భమ్రాగఢ్ తాలూకాలో సోమవారం ఆ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
సిఆర్పిఎఫ్ జవాన్లు, గడ్చిరోలీ పోలీసు విభాగంలోని సి-60 స్పెషలైజ్డ్ కంబాట్ యూనిట్ సంయుక్తంగా ఆ ఆపరేషన్ నిర్వహించాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రెండు రోజుల పాటు సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందింది. నవంబర్ 20న మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న తరుణంలో దాడులు చేయడానికి ప్రణాళికలు రచించడం కోసమే మావోయిస్టులు భేటీ అయినట్లు తెలుస్తోంది.
మావోయిస్టులు ఉన్నారని అంచనా వేసిన రెండు ప్రాంతాలకు పోలీసులు చేరుకున్నారు. వారిని గమనించిన మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ప్రతికాల్పులు జరిపారు. ఆ క్రమంలో ఐదుగురు మావోయిస్టులు హతమారిపోయారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రానికి పూర్తి వివరాలు అందవచ్చునని పోలీసులు వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం మహారాష్ట్ర అంతటా భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేస్తున్నారు. ఆ క్రమంలోనే మావోయిస్టు హింసాకాండ ఎక్కువగా ఉండే గడ్చిరోలీ జిల్లాలో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడా మరింతమంది మావోయిస్టులను పోలీసులు ఎదుర్కొనే అవకాశముందని తెలుస్తోంది.