ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా రాణీపూర్ గ్రామంలో ముస్లిం అతివాదులు శివాలయ పునరుద్ధరణ పనులను నిలిపివేయడానికి ప్రయత్నించారు. గుడిలో మరమ్మతులు చేయించడం వల్ల అక్కడికి వంద మీటర్ల దూరంలో ఉన్న మసీదులో నమాజు సమయంలో ఇబ్బంది అవుతుందని నిహాల్, అనీస్ ఖాన్, అస్గర్‌ఖాన్, షోయబ్, సలీం, యూనుస్, రయీస్ తదితరులు ఆరోపించారు. ఈ సంఘటన బిఘాపూర్ పోలీస్ స్టేషన్ నిబాయీ ఔట్‌పోస్ట్ పరిధిలో చోటు చేసుకుంది.
రాణీపూర్ గ్రామంలో సుమారు 125 ముస్లిం కుటుంబాలు, కేవలం 25-30 మాత్రమే హిందూ కుటుంబాలు ఉన్నాయి. ఆ గ్రామంలో 70ఏళ్ళకు పైగా ఒక శివాలయం ఉంది. గ్రామంలోని హిందువులు అక్కడే తమ ధార్మిక, మతపరమైన కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఆ గుడికి చుట్టూ గోడలున్నాయి, పునాదులున్నాయి. కానీ పైకప్పు మాత్రం లేదు. పైకప్పు కట్టించడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ముస్లిం అతివాదులు అడ్డుకుంటున్నారు. గుడికి సుమారు వంద మీటర్ల దూరంలో ఒక మసీదు ఉంది, కాబట్టి గుడిలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టినా దానివల్ల నమాజ్‌కు ఏదో ఒకసమయంలో కచ్చితంగా అంతరాయం కలుగుతుంది… అని వారి వాదన. అందువల్ల గుడిలో ఎలాంటి నిర్మాణాలూ లేక మరమ్మతులూ చేపట్టకూడదంటున్నారు.
ఈ వివాదం అక్టోబర్ 8న బిఘాపూర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. దాంతో ఆ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించే చర్యలకు పాల్పడవద్దంటూ 26మంది ముస్లిములకు, 6గురు హిందువులకు అధికారికంగా హెచ్చరికలు జారీ చేసామని పోలీసులు చెప్పారు. ఏదైనా ధార్మిక ప్రదేశం నిర్మాణానికి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్థానిక సర్కిల్ ఇనస్పెక్టర్ చెప్పారు. అందువల్ల గుడికి పైకప్పు వేయించాలంటే మొదట సంబంధిత అనుమతులు తీసుకుని రావాలంటూ స్థానిక హిందువులకు చెప్పారు. మొత్తం వ్యవహారం గురించి సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్‌కు పోలీసులు వివరించారు.