కృష్ణా నదికి మరోసారి వరద పోటెత్తింది.కర్ణాటక, తెలంగాణలో కురిసిన అతి భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. దీంతో 6 గేట్లు ఎత్తి 90 వేల క్యూసెక్కుల వరద నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 69 వేల క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 212 టీఎంసీలు కాగా ప్రస్తుతం 211 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ నుంచి 8 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల వరద పులిచింతలకు విడుదల చేశారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 315 టీఎంసీలు కాగా ప్రస్తుతం 314 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి, ఎడగ కాలువలకు 12 వేల క్యూసెక్కులు, మాధవరెడ్డి ఎత్తిపోతలకు 2 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో అక్కడ నుంచి లక్ష క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి లక్షా 20 వేల క్యూసెక్కుల వరద సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.