ఈ డిజిటల్ యుగంలో ప్రపంచం అంతా మన అరచేతుల్లోకి ఒదిగిపోయింది. ప్రతీ ఒక్కరి దగ్గరకూ కావలసిన సమాచారం చేరుతోంది. ఇంకా చెప్పాలంటే అవసరమైన దానికంటె ఎక్కువే అందుతోంది. కానీ అన్ని అంశాలపై సరైన అవగాహన లేకపోవడంతో ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు ఉంటూనే ఉన్నాయి. అలాంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో… ‘వక్ఫ్ బోర్డ్ మరియు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ అంశంపై రితమ్ డిజిటల్ మీడియా ఫౌండేషన్ అవగాహన సదస్సు నిర్వహించింది. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని సరస్వతీ శిశుమందిరంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి పెద్దసంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హిందూవాహిని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రముఖ్ రాజవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములు ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ కబ్జాదారుల చేతుల్లో పడి కుదించుకుపోతున్నాయని చెప్పారు. మరోవైపు ముస్లిములు, క్రైస్తవులకు సంబంధించిన భూములన్నీ వారివారి మతసంస్థల చేతుల్లో సురక్షితంగా ఉన్నాయన్నారు. ఏది వక్ఫ్ ప్రాపర్టీ, ఏది కాదో ఎవరూ గుర్తించలేకపోతున్నారని, వక్ఫ్ ట్రిబ్యునల్ ఏం చెప్తే అదే ఖరారైపోతోందనీ ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి సమస్యలను నివారించేందుకే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో సవరణలు తీసుకొస్తోందని వివరించారు.
మరో ముఖ్య అతిథి, తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది విశ్వప్రసాద్ మాట్లాడుతూ దేశాన్ని అన్నివిధాలా విడగొట్టేందుకు కుట్రపూరితంగా ప్రయత్నాలు జరిగాయని వివరించారు. అసలు ముస్లింలకు భారత్ లో ఎలాంటి ఆస్తులు లేవనీ, వాటిని కాపాడేందుకు చట్టం ఎలా తీసుకొచ్చారనీ ఆయన ప్రశ్నించారు. దేవాలయాల ఆస్తులన్నీ ఒకప్పుడు వాటిని కాపాడే వారి దగ్గర ఉండేవని, ప్రస్తుతం వాటిపై ప్రభుత్వాలు పెత్తనం చెలాయిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ముస్లిం, క్రైస్తవ ఆస్తులు మాత్రం ఆయా వర్గాల నియంత్రణలోనే వదిలేసారని వివరించారు.
వక్తలు వక్ఫ్ బోర్డు వల్ల కలిగే అనర్ధాలను సోదాహరణంగా విడమరిచి చెప్పారు. సనాతన బోర్డు తెచ్చుకోవలసిన ప్రాధాన్యతను స్పష్టంగా వివరించారు. ఆ కార్యక్రమానికి మీడియా భాగస్వాములుగా మై ఇండ్ మీడియా, ఆర్ వాయిస్, జాగృతి టీవీ వ్యవహరించాయి.