ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపర్వంత్ సింగ్ పన్నూ మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. నవంబరు 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఆ మధ్యకాలంలో విమానాల్లో పేలుళ్లు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. సిక్కుల అల్లర్లు జరిగి 40 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా విమానాల్లో బాంబులు పెట్టే ప్రమాదముందని పన్నూ హెచ్చరికలు జారీ చేశాడు.
సిఖ్స్ ఫర్ జస్టిస్ పేరుతో 2007లో ఓ సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థను ఏర్పాటు చేసిన వారిలో పన్నూ ఒకరు. 2019లో ఈ సంస్థను కేంద్రం ఉగ్ర సంస్థగా ప్రకటించింది. అప్పటి నుంచి పన్నూ కెనడా, అమెరికాల్లో తలదాచుకుంటున్నాడు. పన్నూ హెచ్చరికలు జారీ చేయడం ఇది తొలిసారి కాదు. గత ఏడాది ఇదే సమయంలో కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఢిల్లీ విమానాశ్రయం పేల్చి వేస్తామని, దానిపేరు మారుస్తామంటూ హెచ్చరికలు చేశాడు.
గత రెండు రోజుల్లో 32 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అన్ని విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణీకుల భద్రతే తమ లక్ష్యమని, బెదిరింపు కాల్స్ వచ్చిన ప్రతి విమానాన్ని తనిఖీ చేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు.తాజాగా పన్నూ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ అప్రమత్తమైంది.