ఢిల్లీలోని రోహిణి ప్రశాంత్ విహార్ సమీపంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద ఆదివారం చోటు చేసుకున్న పేలుడుకు పాల్పడింది తామేనని జస్టిస్ లీగ్ ఆఫ్ ఇండియా అనే ఖలిస్థానీ అనుకూల సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన మేజేజ్‌లు టెలిగ్రామ్‌లో వైరల్ అయ్యాయని నిఘా సంస్థలు ప్రకటించాయి. ఇవి ఎక్కడ నుంచి మొదలయ్యాయనే విషయాన్ని టెలిగ్రామ్ సంస్థ నుంచి పోలీసులు రాబడుతున్నారు.
ఖలిస్థాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మేసేజీలు పెట్టారని నిఘా సంస్థలు గుర్తించాయి. ఆదివారం ఉదయం 7గంటల 30 నిమిషాలకు సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద పేలుడు సంభవించింది. ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పేలుడులో పాఠశాల గోడ కూలిపోయింది. సమీపంలో దట్టంగా పొగలు వ్యాపించాయి. కార్లు, బైకులు దెబ్బతిన్నాయి.
తేలికపాటి ఐఈడీ ద్వారా పేలుడుకు పాల్పడ్డారని గుర్తించారు. తెల్లని దుస్తులు ధరించిన ఓ నిందితుడిని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. దీని వెనుక ఏ గ్రూపు హస్తం ఉందనే విషయం మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఢిల్లీ నగరమంతా అలర్ట్ ప్రకటించారు.