కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ స్థానానికి జరగనున్న ఉపయెన్నిక రకరకాల రాజకీయ మలుపులతో ఆసక్తికరంగా నిలుస్తోంది. రాహుల్ గాంధీ రాజీనామా కారణంగా ఆ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు అక్కడ రాహుల్ సోదరి ప్రియాంక పోటీ చేయనుంది. అయితే ఆ కుటుంబానికి ఇప్పుడు అక్కడ పరిస్థితి పూలపాన్పులా ఏమీ లేదు.
రాహుల్ గాంధీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ, వయనాడ్ రెండు స్థానాల నుంచీ పోటీ చేసారు, అమేథీలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ఆయన వయనాడ్, రాయ్‌బరేలీ స్థానాల నుంచి పోటీ చేసారు. ఇంకా చెప్పాలంటే రెండో దశలో వయనాడ్ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే రాయ్‌బరేలీ పోలింగ్ ఉన్న ఐదో దశ నోటిఫికేషన్ మొదలైంది. వయనాడ్ పోలింగ్ పూర్తయే వరకూ రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ లేదా అమేథీలో పోటీ చేస్తానని కనీసం మాట మాత్రంగానైనా చెప్పలేదు. ఈసారి రెండు సీట్లలోనూ గెలిచారు. అయితే రాయ్‌బరేలీ సీటును అట్టిపెట్టుకుని వయనాడ్‌కు రాజీనామా చేసారు. ఫలితంగా వయనాడ్‌లో ఎన్నిక అనివార్యమైంది.
గాంధీ కుటుంబం తమను కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేస్తోందన్న అసంతృప్తి వయనాడ్ ఓటర్లలో ఉంది. 2019 సంక్షోభ సమయంలో రాహుల్‌కు అండగా నిలిచింది వయనాడే తప్ప అమేథీ కాదు. అయినా కూడా ఇప్పుడు రాహుల్ తమను వదిలేయడం వయనాడ్ ఓటర్లకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు ప్రియాంకను వారు రాహుల్‌కు బదులుగా వచ్చిన అభ్యర్ధిగానే భావిస్తారు తప్ప ప్రత్యామ్నాయంగా భావించరు. అందువల్ల వయనాడ్ ఓటర్లు 2019, 2024 ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి వేసినంత ఉత్సాహంగా ఇప్పుడు ప్రియాంకకు వేసే అవకాశాలు పెద్దగా లేవనే చెప్పుకోవచ్చు.
గాంధీ కుటుంబానికి అవసరానికి వాడుకోవడం తప్ప దక్షిణాది అంటే పెద్దగా ఆసక్తి లేదు. రాహుల్ గాంధీ లాగే అతని తల్లి సోనియా గాంధీ కూడా కర్ణాటకను వాడుకున్నారు. 1999లో సోనియా బళ్ళారి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసారు. అప్పుడు సోనియా బళ్ళారి, అమేథీ రెండు చోట్లా విజయం సాధించారు. అప్పుడామె బళ్ళారి సీటుకు రాజీనామా చేసారు. అంతకుముందు 1980లో ప్రియాంక నాయనమ్మ ఇందిరాగాంధీ కూడా అలాంటి పనే చేసింది. రాయ్‌బరేలీతో పాటు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ నుంచి పోటీ చేసి, రెండు చోట్లా గెలిచారు. అప్పుడు కూడా బరేలీ స్థానాన్ని ఉంచుకుని, మెదక్‌ను వదిలేసారు.
వయనాడ్ ఎంపీ సీటుకు రాహుల్ గాంధీ రాజీనామా చేయడానికి ఎన్నో కారణాలున్నాయి. యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్‌లో భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ (ఐయుఎంఎల్) రాహుల్ గాంధీని బ్లాక్‌మెయిల్ చేసింది. కేరళలో యుడిఎఫ్‌లో రెండో అతిపెద్ద పార్టీ ముస్లింలీగే. వయనాడ్ లోక్‌సభ స్థానంలో 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వాటిలో ఎరనాడ్, నీలాంబర్ నియోజకవర్గాలు ముస్లింలీగ్ కంచుకోటలు. అక్కడ కాంగ్రెస్ గెలవాలంటే ముస్లింలీగ్ మద్దతు తప్పనిసరి. 2019 ఎన్నికల్లో రాహుల్‌కు మద్దతు ఇచ్చినందుకు ప్రతిగా ముస్లింలీగ్ తమిళనాడులోని రామనాథపురం సీటును బలవంతంగా తీసుకుంది. అంతకుముందెప్పుడూ రామనాథపురంలో ముస్లింలీగ్ కనీసం పోటీ అయినా చేయలేదు.
రాహుల్ వయనాడ్ స్థానాన్ని వదులుకోడానికి మరో కారణం, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు క్రమంగా పతనం అవుతూ వస్తోంది. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమిలో భాగంగా కాంగ్రెస్ 93 స్థానాల్లో పోటీ చేసింది, కానీ కేవలం 21 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 1982 తర్వాత కేరళలో కాంగ్రెస్ అత్యంత పేలవమైన ప్రదర్శన అదే. 1982లో కాంగ్రెస్ 36 స్థానాల్లో పోటీ చేసి 20 సీట్లలో గెలిచింది. 2021లో అది ఇంకా దిగజారిపోయింది. అదే ముస్లింలీగ్ విషయానికి వస్తే 2021లో ఆ పార్టీ 25 సీట్లలో పోటీ చేసి 15 సీట్లు గెలుచుకుంది. అంటే 60శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ 23శాతం మాత్రమే. ఈ పరిస్థితుల్లో 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యుడిఎఫ్ కూటమి సీట్ల సర్దుబాటులో ముస్లింలీగ్, ఇతర భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్ కంటె ఎక్కువ స్థానాలు డిమాండ్ చేయడం ఖాయం.
కూటమిలో ఎక్కువ సీట్లు మాత్రమే కాదు, 2026 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి కూడా తమ పార్టీకే కావాలని ముస్లింలీగ్ అడిగే అవకాశాన్ని త్రోసిపుచ్చలేము. అలాంటప్పుడు వయనాడ్ నుంచి ఎంపీగా ఉండే వ్యక్తి ముస్లింలీగ్, ఇతర మిత్రపక్షాల డిమాండ్లకు తలొగ్గి ఉండాల్సి వస్తుంది.
అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో వయనాడ్ ఎంపీగా ఉండడం రాహుల్ గాంధీకి చాలా కష్టమవుతుంది. రాహుల్ లేదా ప్రియాంక సంగతి తర్వాత, రాబోయే రోజుల్లో వయనాడ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్‌కు చాలా కష్టమే. అందుకే తన లోక్‌సభ సీటును కాపాడుకోడానికే రాహుల్ గాంధీ వయనాడ్‌కు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రియాంకకు కూడా వయనాడ్‌లో పోటీ పులిమీద స్వారీయే.