పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై నలుగురు దొంగలను తెలంగాణ పోలీసులు వెంబడించారు. వారు బైకులపై పారిపోవడంతో పోలీసులు వెంబడించారు. ధర్మవరం సమీపంలో జాతీయ రహదారిపై దొంగలపై తెలంగాణ పోలీసులు కాల్పులు జరిపి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు పరారయ్యారు.
దొంగల పరుగులు, పోలీసుల కాల్పులతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియలేదు. చివరకు విషయం స్థానిక డీఎస్పీకి తెలియడంతో ఆరా తీశారు. ఓ దొంగతనం కేసులో నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా వారు బైకులపై జాతీయ రహదారిపై పారిపోయారు. వారిని పోలీసులు వెంబడించి కాల్పులు జరిపి పట్టుకున్నారని వెల్లడించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.