భారత్‌తో మొదటి మ్యాచ్‌లో న్యూజీలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో మాట్ హెన్రీ, విలియమ్ ఓ రౌర్క్‌ల అద్భుతమైన బౌలింగ్ ప్రతిభ, రచిన్ రవీంద్ర బ్యాటింగ్ నైపుణ్యం న్యూజీలాండ్‌ను విజయతీరాలకు చేర్చాయి.
భారతదేశంలో కివీస్ జట్టు విజయం సాధించడం 36ఏళ్ళలో, అంటే 1988 తర్వాత, ఇదే మొదటిసారి. ఈ విజయంతో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సీరీస్‌లో న్యూజీలాండ్ 1-0 ఆధిక్యం సాధించింది.
107 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్ జట్టు మొదటి ఓవర్ రెండో బాల్లోనే వికెట్ కోల్పోయింది. కెప్టెన్ టామ్ లాతామ్ను భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా డకౌట్ చేసాడు. విల్ యంగ్, డేవాన్ కాన్వే భాగస్వామ్యం నిర్మించేందుకు ప్రయత్నించారు. మళ్ళీ బుమ్రాయే వారిని విడదీసాడు. కాన్వేను 17 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఎల్బిడబ్ల్యూగా ఔట్ చేసాడు. అలా 12.3 ఓవర్లు అయేసరికి న్యూజీలాండ్ 35 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో విల్ యంగ్‌కు రచిన్ రవీంద్ర తోడయ్యాడు. 13.4 ఓవర్లు అయేసరికి కివీస్ స్కోరు 50కి చేరుకుంది. యంగ్, రవీంద్ర కలిసి 26.3 ఓవర్లకల్లా వంద పరుగుల స్కోర్ సాధించారు. 27.4 ఓవర్‌కల్లా 110 పరుగులు సాధించి, న్యూజీలాండ్ మ్యాచ్‌ను గెలుచుకుంది. యంగ్ 48, రచిన్ 39 పరుగులు చేసారు.
అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 462 పరుగుల వద్ద ముగించింది. న్యూజీలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయిన భారత్… రెండో ఇన్నింగ్స్ బాగానే ఆడినా ఫలితం లేకపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ గంట ఆలస్యంగా మొదలైనా, తర్వాత ఎండ రావడంతో కివీస్ బ్యాటర్లకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది.
స్కోర్లు క్లుప్తంగా:
భారత్ : మొదటి ఇన్నింగ్స్ 46, రెండో ఇన్నింగ్స్ 462 (సర్ఫరాజ్ ఖాన్ 150, రిషభ్ పంత్ 99, విలియం ఓ రౌర్క్ 3/92)
న్యూజీలాండ్ : మొదటి ఇన్నింగ్స్ 402, రెండో ఇన్నింగ్స్ 110/2 (విల్ యంగ్ 48*, రచిన్ రవీంద్ర 39*, జస్ప్రీత్ బుమ్రా 2/29)