ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు ఆర్ధిక సహాయం ఏర్పాటు చేస్తామని కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మొత్తం గ్రాంటా లేక ఋణమా అన్న విషయంలో సందేహాలు ఉండేవి. ఇప్పుడా అంశంపై స్పష్టత వచ్చింది. ఆ మొత్తాన్ని కేంద్రమే ఋణంగా తీసుకుని రాష్ట్రానికి సమకూరుస్తుంది.
అమరావతి నిర్మాణానికి కావలసిన రూ.15వేల కోట్లను అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల ద్వారా సమకూరుస్తామని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి బడ్జెట్ సమావేశంలో వెల్లడించారు. ఆ మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్లు కేంద్రానికి ఋణంగా ఇస్తాయి. అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరిట ఆ రెండు బ్యాంకులూ చెరో 80 కోట్ల డాలర్ల చొప్పున సమకూరుస్తాయి. 160 కోట్ల డాలర్లు అంటే సుమారు 13,440 కోట్లు బ్యాంకుల ద్వారా వస్తే, మిగతా మొత్తాన్ని కేంద్రం ఇతర నిధుల నుండి సమకూరుస్తుంది. బ్యాంకులకు ఋణాన్ని కేంద్రం తిరిగి చెల్లిస్తుంది.
అమరావతి ప్రాజెక్టుకు నిధుల వివరాలను ప్రపంచబ్యాంకు తమ వెబ్సైట్లో ఉంచింది. వాటి ప్రకారం ప్రపంచ బ్యాంకు నుంచి ఋణం తీసుకునేది కేంద్రప్రభుత్వం. ప్రాజెక్టును అమలు చేసే ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ – ఏపీ సీఆర్డీఏ. ‘ప్రోగ్రామ్ ఫర్ రిజల్ట్స్ ఫైనాన్సింగ్’ విధానంలో ఈ ఋణం సమకూరుస్తారు.
అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చే ఈ ఋణాలను రాష్ట్రప్రభుత్వం చెల్లించనక్కరలేదు. కేంద్రమే తిరిగి చెల్లించుకుంటుంది. కాబట్టి ఆ మొత్తాన్ని గ్రాంటుగా పరిగణించవచ్చు.