ఘోరం జరిగింది. కడప జిల్లా బద్వేలు సమీపంలో ఉన్మాది విఘ్నేష్ ఓ బాలికపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో ఆ బాలిక కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
బద్వేలుకు చెందిన ఓ బాలిక ఇంటర్ చదువుకుంటోంది. విఘ్నేష్ అనే వంట మాస్టర్‌తో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అతని భార్య గర్భిణి. అయితే తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతోనే, పెట్రోలు పోసి నిప్పు పెట్టాడని బాధితురాలు, కడప రిమ్స్ ఆసుపత్రిలో న్యాయమూర్తికి వాంగ్మూలం ఇచ్చిందని పోలీసులు తెలిపారు. ఆదివారం బాలికకు ఫోన్ చేసి వెంటనే రావాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ విఘ్నేష్ బెదిరించినట్లు బాధితురాలు వాగ్మూంలంలో పేర్కొంది. దీంతో ఆ బాలిక ఆటో ఎక్కి అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. బద్వేలు నుంచి పది కి.మీ దూరంలోని చెక్ పోస్టు వద్ద ఇద్దరూ దిగి పొలాల్లోకి వెళ్లారు. అప్పటికే తెచ్చుకున్న పెట్రోలు బాలికపై పోసి నిప్పు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక అరుపులు విన్న పొలాల్లోని వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని 80 శాతం కాలిన గాయాలతో ఉన్న బాలికను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మరణించిందని పోలీసులు చెప్పారు.
బాధితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. గత రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.