తిరుమల లడ్డూ వివాదం, ఆలయాలపై దాడుల ఘటనలు, దేవాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్న అన్యమతస్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే హిందూ దేవాలయాల నిర్వహణను హిందూ సమాజానికే అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. దేవాలయాలను ప్రభుత్వీకరణ కాదు, హిందూ సమాజీకరణ చేయడం నేటి అవసరం అని పిలుపునిచ్చింది. హిందూ సమాజం ఆకాంక్షలను వ్యక్తీకరించేందుకు 2025 జనవరి 5న విజయవాడలో ‘హైందవ శంఖారావం’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని ప్రకటించింది.
విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ హిందూ సమాజం మనోభావాలను, సమస్యలను అర్ధం చేసుకుని ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. ఆలయాల్లో పూజాదికాల నిర్వహణలో అధికారుల జోక్యం వద్దంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతించారు. ఆలయాలను పవిత్రంగా, శ్రద్ధగా నిర్వహించడానికి మరిన్న చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు.
హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రసాదం పవిత్రత విషయంలో వచ్చిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా హిందువులను దిగ్భ్రాంతికి, ఆందోళనకు, ఆక్రోశానికీ గురిచేసాయని సురేంద్రజైన్ అన్నారు. భక్తుల విశ్వాసాలు, మనోభావాలే కాకుండా సంపూర్ణ దేవాలయ వ్యవస్థే పెనుప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేసారు. హిందువుల విశ్వాసాలతో ఆటలాడుకునే ధోరణి అనేక దేవాలయాల నిర్వహణలో కనిపిస్తోందన్నారు. అనేక ప్రముఖ దేవాలయాలు ప్రభుత్వాధీనంలో ఉన్నాయన్న సురేంద్ర జైన్, హిందూ సమాజమే స్వతంత్రంగా దేవాలయాలను నిర్వహించుకున్ననాడు హిందువుల ధార్మిక విశ్వాసాలకు గౌరవమర్యాదలు దక్కుతాయని స్పష్టం చేసారు.
‘‘తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయమే కాకుండా అనేక మందిరాల్లో హిందువులు భక్తిప్రపత్తులతో సమర్పించిన ముడుపులు దేవాలయ అధికారులు, పాలక మండళ్ళ ద్వారా దుర్వినియోగం అవుతున్న వార్తలెన్నో వినవస్తున్నాయి. టిటిడి సహా ప్రభుత్వ నియంత్రిత దేవాలయాల్లో హైందవేతరులను నియమించి హిందూ విశ్వాసాలతో ఆటలాడుకున్నారు. ప్రభుత్వం ఆలయాలను నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమూ, హిందూ విశ్వాసాల మీద దాడి కూడా. దేవాలయాల నిర్వహణలోను, ఆలయాల ఆస్తుల విషయంలోనూ ప్రభుత్వాలు దూరంగా ఉండాలని న్యాయస్థానాలు అనేకసార్లు స్పష్టంగా ఆదేశాలు జారీచేసాయి. ప్రభుత్వాలు హిందూ దేవాలయాలను నిర్వహించడం రాజ్యాంగంలోని 12, 25, 26 అధికరణాలను ఉల్లంఘించడమే’’ అని సురేంద్ర జైన్ చెప్పారు.
‘‘గతంలో విదేశీ దురాక్రమణదారులు దేవాలయాలను దోచుకున్నారు. ఆంగ్లేయులు ఆలయాలను కబ్జా చేసి నిరంతరం లూటీ చేసారు. హిందూ సంప్రదాయాలను నాశనం చేయాలని సంకల్పం చేసుకున్న కొన్ని రాజకీయ పార్టీలు లౌకికవాదం ముసుగులో దేవాలయాలను దోచుకోవడమే కాకుండా హిందువుల ఆలయ వ్యవస్థను నాశనం చేయాలనే తమ అజెండాను పూర్తి చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాయి. హిందూ ఆలయాల సంపదలను హిందూ శ్రేయస్సు కోసం మాత్రమే ఉపయోగించాలి. హిందూ ధర్మ ఉద్ధరణ, శ్రేయస్సు కోరే అనేక మంచిపనులను దేవాలయాల ఆదాయంతో నిర్వహించాలి. కానీ ఇవాళ అటువంటి పనులన్నిటినీ ఉపేక్షించారు’’ అని సురేంద్ర జైన్ ఆవేదన వ్యక్తం చేసారు.
‘‘దేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలయినా హిందువులకు తమ ఆలయాలు నిర్వహించుకునే స్వతంత్ర అధికారం లేదు. మైనారిటీ మతాలు తమ ప్రార్థనా స్థలాల నిర్వహణ తామే చూసుకుంటాయి. కానీ రాజ్యాంగబద్ధమైన ఆ హక్కు హిందూ సమాజానికి నేటికీ ప్రాప్తించలేదు. హిందువుల అధీనంలో ఉన్న అనేక దేవాలయాలు చక్కగా నిర్వహించబడుతూ జాతీయ విపత్తుల సమయంలో యోగ్యవంతమైన భూమిక నిర్వహించిన ఉదంతాలు కనిపిస్తున్నా సరే, ప్రభుత్వాలు దేవాలయాలను వదిలిపెట్టడం లేదు. ‘దేవాలయాల ప్రభుత్వీకరణ కాదు – హిందూ సామాజీకరణ నేటి అవసరం’ అన్నదే విశ్వహిందూ పరిషత్ భావన’’ అని సురేంద్ర జైన్ వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో హిందూ సమాజం ఆకాంక్షలను సురేంద్ర జైన్ ఈవిధంగా సూత్రీకరించారు…
— టిటిడి సహా అన్ని దేవాలయాలనూ ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తం చేసి, హిందూ సమాజానికి లోబడి ఒక ఉత్తమ నూతన వ్యవస్థకు అప్పజెప్పాలి. ఆ నూతన వ్యవస్థ నమూనాను హిందూ ధర్మాచార్యులు దశాబ్దాలుగా చర్చించి ఒక రూపాన్ని నిర్ధారించారు.
— అంతవరకూ దేవాలయాలు అన్నింటిలోనూ పూజలు, ప్రసాదాలు, ఇత్యాది సేవలన్నీ అత్యంత భక్తిప్రపత్తులతో నాణ్యతతో నిర్వహించేలా చూడాలి. దాన్ని ఉల్లంఘించిన, ఉల్లంఘిస్తున్న దోషులను కఠినంగా శిక్షించాలి.
— దేవాలయాల నిర్వహణలో ఉద్యోగులుగా హైందవేతరులకు స్థానం కల్పించకూడదు, ఇప్పటికే ఉన్నవారిని తక్షణమే తొలగించాలి.
— దేవాలయ ట్రస్టు బోర్డులలో హైందవేతరులను, రాజకీయ వ్యక్తులను నియమించకూడదు.
— దేవాలయాల చేరువలో హైందవేతరులకు దుకాణాలు, వ్యాపారాల నిర్వహణకు అవకాశం ఇవ్వకూడదు.
— దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలి.
— దేవాలయాల ఆదాయాన్ని, స్థిరాస్తులను ప్రభుత్వాలు హిందూధార్మికేతర ప్రజాపాలనా కార్యక్రమాలకు వినియోగించకూడదు.
— హిందూ సమాజంపై, ఆలయాలపై ఉన్మాదంతో కుట్రపూరితంగా దాడులు చేస్తున్న ఇతర మతస్తులు, విద్రోహులను ప్రభుత్వాలు గుర్తించి అత్యంత కఠినంగా శిక్షించాలి.
‘‘హిందూ దేవాలయాల స్వయంప్రతిపత్తి కోరుతూ విశ్వహిందూ పరిషత్ దేశవ్యాప్తంగా ఒక మహా ఉద్యమాన్ని ప్రారంభించనుంది. దానికోసం సెప్టెంబర్ 30న అన్ని రాష్ట్రాల గవర్నర్లకూ ‘హిందూ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కలిగిస్తూ చట్టసవరణ చేయాలని’ కోరుతూ మెమొరాండం సమర్పించామని విశ్వహిందూ పరిషత్ తరఫున సురేంద్రజైన్ తెలియజేసారు. ఆ జాతీయ ఉద్యమంలో భాగంగా హిందువుల మనోభావాలను, సమస్యలను అర్ధం చేసుకుని ప్రభుత్వాలు స్పందించాలన్న ఆశయంతో, హిందూ సమాజం తన ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు ఆంధ్రప్రదేశ్‌లో 2024 జనవరి 5న విజయవాడలో ‘హైందవ శంఖారావం’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టాము’’ అని సురేంద్రజైన్ వివరించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేంద్ర జైన్‌తో పాటు విశ్వహిందూ పరిషత్ ప్రముఖులు పాల్గొన్నారు. పరిషత్ కేంద్రీయ ఉపాధ్యక్షులు మరియు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, పరిషత్ కేంద్ర కమిటీ సభ్యులు వై రాఘవులు, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, సంస్థ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ళ సత్యరవికుమార్, విహెచ్‌పి రాష్ట్ర కోశాధికారి వలివర్తి దుర్గాప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు.