కెనడాలోని ఆరుగురు రాయబారులను భారత్ ఉపసంహరించి వారమైనా గడవకముందే కెనడా మళ్ళీ విషం కక్కింది. చట్టాన్ని గౌరవిస్తూ కెనడాలో కొనసాగుతున్న డజనుమందికి పైగా భారతీయ రాయబారులపై తాము నిఘా పెట్టామని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ వెల్లడించారు.
‘‘ఒట్టావాలో భారత హైకమిషనర్ సహా ఆరుగురు రాయబారులను బహిష్కరించాం. మిగతావారు టొరంటో, వాంకూవర్ నగరాల్లో ఉన్నారు. వారిపై మేం నిఘా ఉంచాం. ఆ సంగతిని స్పష్టంగా చెబుతున్నాను. వారిని మేం గమనిస్తూ పరిశీలిస్తూ ఉన్నాం’’ అని మెలానీ జోలీ ఒక ఇంటర్వ్యూలో వివరించారు. వియన్నా ఒప్పందానికి విరుద్ధంగా ప్రవర్తించే దౌత్యవేత్తలు ఎవరినీ తాము సహించబోమని మెలానీ చెప్పుకొచ్చారు.
కెనడా భారత్ మధ్య దౌత్యవివాదాలు సుమారు ఏడాది నుంచీ కొనసాగుతున్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంటులోనే భారత ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేసాడు. నిజ్జర్ హత్య వెనుక భారత నిఘాసంస్థల హస్తముందని ట్రూడో ఆరోపించాడు. అప్పటినుంచీ ఇరుదేశాల మధ్యా సంబంధాలు దెబ్బతిన్నాయి. కొద్దిరోజుల క్రితం ట్రూడో మాట్లాడుతూ, నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం గురించి తమ దగ్గర ఎలాంటి సమాచారమూ లేదని స్పష్టం చేసారు.
నిజ్జర్ హత్య కేసు విచారణలో భారత హైకమిషనర్, మరో ఐదుగురు దౌత్యవేత్తలకు ఆసక్తి ఉందని కెనడా ప్రకటించింది. ఆ నిరాధార ఆరోపణలపై భారత్ మండిపడింది. తమ హైకమిషనర్‌ను, మరో ఐదుగురు దౌత్యవేత్తలనూ భారత్ వెనక్కు పిలిపించింది.
ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కెనడా ప్రభుత్వం ఉగ్రవాదులపైనా, అతివాదుల పైనా ఎలాంటి చర్యా తీసుకోలేదని భారత్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. మెలానీ తాజా వ్యాఖ్యలకు కొద్దిరోజుల ముందే భారత ప్రభుత్వం, దాని ఏజెంట్లు, దౌత్యాధికారులకు కెనడాలో నేర కార్యక్రమాలతో సంబంధాలున్నాయని నిందించారు. ఆ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తోందని నిందించింది.