ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుకపై సీనరేజీ రద్దు చేసింది. ఇప్పటి వరకు ఎడ్లబండ్లపై మాత్రమే ఉచితంగా ఇసుక తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక నుంచి ట్రాక్టర్లలో కూడా ఎవరైనా ఉచితంగా నింపుకుని వెళ్ల వచ్చని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు తమకు అవసరమైన ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించుకునే అవకాశం దక్కింది. లారీల్లో ఇసుక తరలించే క్రమంలో 40 టన్నులకు మించినా అలాంటి ట్రక్కును ఎవరూ ఆప వద్దని సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.
ఏపీలో ప్రతి రోజూ 6 లక్షల టన్నుల ఇసుక అవసరం ఉండగా, ప్రస్తుతం 4 లక్షల టన్నులే లభిస్తోంది. దీంతో ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఉచిత ఇసుక భారంగా మారడంతో నిర్మాణరంగం ఊపందుకోలేదు. దీంతో లక్షలాది మందికి ఉపాధి లభించడం లేదని గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.