తెలంగాణలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నివారించే విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చింది.
తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలోనూ ఇవాళ నిరసనలు, ఆందోళనలు చేపడతామని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ప్రకటించారు.
శరన్నవరాత్రుల సమయంలో హైదరాబాద్‌లో హిందూ దేవతా మూర్తులను ధ్వంసం చేసిన సంఘటనలు రెండు చోటు చేసుకున్నాయి. ఆ సంఘటనలపై హిందూ ధార్మిక సంస్థలు ఆందోళన వ్యక్తం చేసాయి.
మొదటి సంఘటనలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దుర్గా పండాల్‌ను ధ్వంసం చేసారు. ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఆకతాయి అని, అది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి కాదనీ పోలీసులు ప్రకటించారు. ఆ వ్యక్తి ఆకలిగా ఉండడంతో ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చి ప్రసాదాన్ని తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు దుర్గాదేవి మూర్తిని ధ్వంసం చేసాడని పోలీసులు చెప్పుకొచ్చారు. పోలీసుల కథను హిందూ సంస్థలు కానీ, సామాన్య హిందువులు కానీ నమ్మలేదు. ఆ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రెండో సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ గుడిలోకి ఒక ముస్లిం దుండగుడు అర్ధరాత్రి వేళ దూరాడు. అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని అది పడిపోయేవరకూ తంతూనే ఉన్నాడు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నాయకులు ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఆ ముస్లిం వ్యక్తి దురాగతాన్ని తీవ్రంగా ఖండించారు.