దేశంలో బాల్య వివాహాలు ఆందోళన కలిగిస్తున్నాయని, వాటిని అడ్డుకునేందుకు ప్రతి జిల్లాకు ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. బాల్య వివాహాలు పిల్లల హక్కులను కాలరాస్తున్నాయని, వారి ఎదుగుదలకు ఆటంకంగా మారడంతోపాటు, వారిలో అనే అనారోగ్యాలకు కారణం అవుతున్నాయని సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. 141 పేజీల తీర్పులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలను పొందుపరిచారు.
బాల్య వివాహాలను పూర్తిగా అడ్డుకునేందుకు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి, వారికి ఇతర ఏ విధులు అప్పగించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు అందరూ బాల్య వివాహాలను అడ్డుకునే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని, ప్రత్యేక అధికారికి అవసరమైన పోలీసు బలగాలను కూడా ఇవ్వాలని సుప్రీంకోర్టు తన 141 పేజీల తీర్పులో పేర్కొంది. బాల్య వివాహాల గురించి తెలియగానే స్థానిక కోర్టులు సుమోటాగా కేసును తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది.