వక్ఫ్ చట్టంలోని నియమాలు అన్యాయంగా ఉన్నాయంటూ కేరళలోని కేథలిక్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. వక్ఫ్ నియమ నిబంధనలను తక్షణం సంస్కరించాలని కోరింది.
కేరళలో ఇటీవల కేథలిక్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్నవారు వక్ఫ్ బోర్డ్ చర్యలపై తమ ఆందోళనలను వెల్లడించారు. వక్ఫ్ చట్టంలో కాలానుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కోరారు. వివిధ మతాలకు చెందిన వ్యక్తులు లేదా సంస్థల భూములను వక్ఫ్ ముసుగులో ఆక్రమించేసుకుంటూ ఉండడం ప్రమాదకరంగా మారిందన్నారు.
ఇప్పుడు అమల్లో ఉన్న వక్ఫ్ చట్టం నియమాల ప్రకారం ఏదైనా భూమి తమదే అని వక్ఫ్ బోర్డ్ ప్రకటిస్తే దాన్ని కనీసం ప్రశ్నించే అధికారం కూడా అవతలి పక్షానికి లేదు. అది పూర్తి అన్యాయమని కేథలిక్ కాంగ్రెస్ భావించింది. ‘‘ప్రతీ మతానికీ, వర్గానికీ తమ ఆస్తులను కలిగి ఉండడానికి, వాటిని రక్షించుకోడానికి, సమాజంలో అందరితో కలిసి జీవించడానికి, అభివృద్ధి చెందడానికీ హక్కులున్నాయి’’ అని కేథలిక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ కొచ్చుపరంబిల్ అన్నారు. వక్ఫ్ బోర్డు ముస్లిముల నియంత్రణలో ఉండాలని అంగీకరిస్తూనే, ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టాల వారికి అపరిమిత అధికారాలను ఇస్తున్నాయనీ, ఎలాంటి పరిమితులూ లేవనీ ఆందోళన చెందారు.
వక్ఫ్ బోర్డు తమకున్న అపరిమిత అధికారాన్న అడ్డం పెట్టుకుని, వ్యక్తులు పూర్తిగా వ్యక్తిగత సంపాదనతో కొనుగోలు చేసుకున్న భూములపై వారికి ఉండే రెవెన్యూ హక్కులను సైతం నిరాకరిస్తూ, అలాంటి భూములను సైతం ఆక్రమించుకుంటున్నాయని కేథలిక్ కాంగ్రెస్ విమర్శించింది.
ఇటీవలే, వక్ఫ్ చట్టానికి మద్దతిస్తూ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కేరళ శాసనసభలోని అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ కలిసి ఆ తీర్మానానికి మద్దతిచ్చారు. దానివల్ల మిగతా మతాలకు, ఇతర కులాలకూ ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయని కేథలిక్ కాంగ్రెస్ ఆవేదన చెందింది. ప్రత్యేకించి ఎర్నాకుళం జిల్లాలోని మునంబం, చేరై ప్రాంతాల్లో ఇతర మతస్తులు, ఇతర కులాలవారూ సొంత భూములను సైతం కోల్పోతున్నారంటూ హెచ్చరించింది. ‘‘ఓటుబ్యాంకే లక్ష్యంగా చేస్తున్న ఈ ప్రయత్నాలు ప్రజాస్వామిక విధానానికి ప్రమాదకరం’’ అన్నారు కేథలిక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ కొచ్చుపరంబిల్. ప్రైవేటు వ్యక్తులు కొన్నితరాలుగా నివసిస్తున్న ఇళ్ళు, సాగుచేసుకుంటున్న పొలాలను కూడా వక్ఫ్ బోర్డు తమదేనంటూ ప్రకటించుకుంటోందని గమనించారు. అలా వక్ఫ్‌బోర్డ్ కబ్జాచేసిన, చేయబోతున్న ప్రదేశాల వివరాలను వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరారు.
న్యాయాన్ని నిలబెట్టడానికి, వక్ఫ్‌బోర్డు అన్యాయంగా భూములను తమవని ప్రకటించేసుకోడాన్ని నివారించడానికీ వక్ఫ్ చట్టానికి సవరణలు చేయడం తక్షణావసరమని కేథలిక్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. అన్ని మతాల వారి హక్కులనూ రక్షించేందుకు న్యాయబద్ధమైన వ్యవస్థను రూపొందించడానికి నిబద్ధతతో పనిచేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఫాదర్ డాక్టర్ ఫిలిప్ కవియిల్ కేథలిక్ కాంగ్రెస్ సమావేశంలో ప్రధాన వక్తగా ప్రసంగిస్తూ… వక్ఫ్ చట్టానికి సమగ్రమైన, లోపభూయిష్టమైన సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కిచెప్పారు.
కేథలిక్ కాంగ్రెస్ అనేది రాజకీయ పార్టీ కాదు. అయినప్పటికీ కేరళలోని సైరో మలబార్ చర్చ్ కమ్యూనిటీకి చెందిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ఆసక్తులను నిర్వచించడంలో, అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 18ఏళ్ళు నిండిన యువతరాన్ని ఒక గొడుగు కింద ఐకమత్యంగా చేర్చాలని ఆ సంస్థ కోరుతుంది. ఆ సంస్థ సభ్యులు ఆధ్యాత్మిక, ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని ప్రార్థిస్తుంది.