వచ్చే నెల జరగనున్న ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మిత్రపక్షాలు ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న విషయం ఖరారయింది. మొత్తం 81 స్థానాలకు గాను బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేయనుంది.
ఝార్ఖండ్‌లో బీజేపీతో పొత్తులో ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఎజెఎస్‌యు), జనతాదళ్ యునైటెడ్ (జెడియు), లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) ఉన్నాయి.
ఎజెఎస్‌యు 10 స్థానాల్లో పోటీ చేస్తుంది. జెడియు 2 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఎల్‌జెపి, ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఛాత్రాలో పోటీ చేస్తుంది. మిగిలిన 68 స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుంది.
ఝార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ, బీజేపీ ఝార్ఖండ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ శివరాజ్‌సింగ్ చౌహాన్, సహ-ఇన్‌ఛార్జ్ హిమంత బిశ్వ శర్మ, ఎజెఎస్‌యు అధ్యక్షుడు సుదేష్ మహతో ఈ మధ్యాహ్నం రాంచీలో మీడియాతో మాట్లాడారు.
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ మిత్రపక్షాలు కలిసి పోటీ చేస్తాయని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ‘‘ఎజెఎస్‌యు, జెడియు, ఎల్‌జెపి, బిజెపి కలిసి పోటీ చేస్తాయి. సీట్‌షేరింగ్ మీద ఒప్పందం కుదిరింది. అభ్యర్ధుల ప్రకటన త్వరలోనే ఉంటుంది’’ అని చౌహాన్ వెల్లడించారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పొత్తుల సమీకరణాన్ని ప్రకటించారు. ‘‘ఎజెఎస్‌యు 10 స్థానాల్లో పోటీ చేస్తుంది. జెడియు 2 సీట్లలోనూ, ఎల్‌జెపి 1 స్థానంలోనూ పోటీ చేస్తాయి. కొన్నిసీట్లలో పరిస్థితులను బట్టి సర్దుబాట్లు ఉంటాయి. ప్రస్తుతానికి పొత్తుసమీకరణాలు ఈ విధంగా ఖరారయ్యాయి’’ అని చెప్పారు.
ఝార్ఖండ్ శాసనసభలో మొత్తం 81 స్థానాలున్నాయి. అక్కడ నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దఫాలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుంది. ఝార్ఖండ్‌లో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లున్నారు. వారిలో 1.31కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళలు. ఈ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేయబోతున్నవారు 11.84 లక్షల మంది ఉన్నారు.