తమిళనాడు కోయంబత్తూరులో ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈశా ఫౌండేషన్ ఆశ్రమంలో చేరేలా తన ఇద్దరు కూతుళ్ళకూ బ్రెయిన్‌వాష్ చేసారనీ, వారిని కుటుంబంతో కలవనివ్వడం లేదంటూ ఒక వ్యక్తి వేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది.
సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, చట్టవిరుద్ధనిర్బంధం పేరిట వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. లత, గీత అనే ఆ ఇద్దరు మహిళలూ మేజర్లని, తమ సొంత నిర్ణయంతో ఆశ్రమంలో ఉంటున్నారనీ, వారి స్వీయ నిర్ణయాన్ని కాదనలేరనీ తేల్చిచెప్పింది.
మొదట మద్రాస్ హైకోర్ట్‌లో పిటిషన్ వేసినప్పుడు ఆ న్యాయస్థానం విచారణకు ఆదేశించినప్పుడు పోలీసులు ఆశ్రమాన్ని రెయిడ్ చేసారు. హైకోర్టు ఆ ఆదేశాలు ఇవ్వడమే పూర్తి అనుచితంగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
అమ్మాయిలు ఇద్దరూ ఆశ్రమంలో చేరేనాటికి వారి వయసులు 27, 24 ఏళ్ళు. అంటే అప్పటికి వాళ్ళిద్దరూ మేజర్లే. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన ప్రయోజనం, వాళ్ళిద్దరూ హైకోర్టు ముందు హాజరవడంతోనే తీరిపోయింది. కాబట్టి హైకోర్టు ఎలాంటి ఆదేశాలూ జారీ చేయవలసిన అవసరం లేదు. అందువల్ల ఆశ్రమంలో విచారణ జరిపించాలన్న హైకోర్టు ఆదేశాలు అసందర్భమైనవని సుప్రీంకోర్టు ధర్మాసనం వివరించింది. వ్యక్తులు లేదా వ్యవస్థలను అపఖ్యాతిపాలు చేయడానికి అలాంటి ఆదేశాలు జారీచేయడం సరికాదని సీజే వ్యాఖ్యానించారు.
మద్రాస్ హైకోర్టు విచారిస్తున్న ఈ కేసును ఈ నెల మొదట్లో సుప్రీంకోర్టు స్వచ్ఛందంగా తమ కోర్టుకు బదిలీ చేసుకుంది. ఆ తండ్రి చేసిన ఆరోపణల మీద పోలీసుల దర్యాప్తు జరిపించాలన్న హైకోర్టు ఆదేశాలను రద్దు చేసింది. అప్పటికే వందలాది పోలీసులు ఈశా ఫౌండేషన్ ఆశ్రమం మీద రెయిడ్ చేసారు.
ఈశా ఫౌండేషన్ తమమీద చేసిన ఆరోపణలను అప్పుడూ ఇప్పుడూ తిరస్కరించింది. ఆ మహిళల వయసు ఇప్పుడు 42, 39 సంవత్సరాలు. వారు తమ ఇష్టం మేరకే ఆశ్రమంలో ఉంటున్నారని వివరించింది. ఆ మహిళలు మద్రాసు హైకోర్టు ముందు హాజరయ్యారు. అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణకు కూడా ఒక మహిళ వీడియో లింక్ ద్వారా హాజరైంది.
తాను, తన సోదరి తమ ఇష్టప్రకారమే ఆశ్రమంలో ఉంటున్నామని ఆమె చెప్పింది. తమ తల్లిదండ్రులు తమను గత ఎనిమిదేళ్ళ నుంచీ వేధిస్తున్నారని చెప్పింది. ఈశా ఫౌండేషన్ తరఫున కేసు వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, తమిళనాడు పోలీసుల స్థాయీనివేదికలో సైతం ఆ మహిళలు తమ ఇష్టపూర్తిగానే ఆశ్రమంలో ఉంటున్నారని నమోదు చేసిన సంగతిని ప్రస్తావించారు.
సుప్రీంకోర్టు ఆ మహిళల తండ్రికి ‘ఎదిగిన కూతుళ్ళ జీవితాలను నియంత్రించే పని చేయవద్దంటూ’ హితవు చెప్పింది. మౌఖికంగా చేసిన వ్యాఖ్యల్లో, పిటిషన్లు దాఖలు చేయడం ద్వారా కాక వారి విశ్వాసాన్ని చూరగొనడం ద్వారా వారి మనసులను గెలుచుకోవాలని ఆ తండ్రికి సుప్రీంకోర్టు సూచించింది.
సీజేఐ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పర్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ మహిళల తండ్రి వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.