రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా ఇప్పటివరకూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉచిత ప్రయాణం హామీని అమలుచేసిందని, ఆంధ్రలో ఎంతకాలం కావాలనీ ఆమె ప్రశ్నించారు.
షర్మిల విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలి వెళ్ళే పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. బస్సులో టిక్కెట్ కొని ఉచితం ఎప్పుడిస్తారు అంటూ కూటమి సర్కారును ప్రశ్నించారు. ఉచిత ప్రయాణం అమలు చేయాలంటూ చంద్రబాబుకు పోస్ట్‌కార్డు రాసారు.
ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతీరోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు, వారి ద్వారా నెలకు 300 కోట్లు ఆదాయం వస్తోందన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఆ 300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుందని భయమా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసం హామీ ఇచ్చారు, మిమ్మల్ని వారు గెలిపించారు. ఇప్పుడా మహిళల కోసం 300 కోట్లు ఖర్చు చేయలేరా? అని నిలదీసారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో 4 పథకాలు మహిళలవే అని గుర్తుచేసిన షర్మిల, వాటిలో తక్కువ ఖర్చు అయ్యే పథకం ఉచిత ప్రయాణమే అన్నారు. అలాంటి పథకాన్ని సైతం అమలు చేయడానికి ధైర్యం రావడం లేదా, ఇదే అమలు చేయనప్పుడు ఇక పెద్ద పథకాల సంగతి ఏంటి? ఐదేళ్ళూ ఇలాగే కాలయాపన చేస్తారా? అని నిలదీసారు.
ఉచిత బస్సు ప్రయాణం చాలా మంచి పథకమని, దానివల్ల మహిళలకు భద్రత ఉంటుందనీ షర్మిల చెప్పారు. ఉచిత ప్రయాణం పథకాన్ని తక్షణమే అమలు చేయాలనీ, సూపర్‌సిక్స్‌లో ఇచ్చిన మిగతా హామీలనూ అమలు చేయాలనీ డిమాండ్ చేసారు. ఉచిత గ్యాస్ సిలెండర్ల హామీని వెంటనే అమల్లోకి తీసుకురావాలని కోరారు.