విజయనగరం జిల్లా గుర్లగ్రామంలో అతిసార విజృంభించింది. వారం రోజుల్లోనే ఏడుగురు చనిపోయారు. గత బుధవారం ఒకరు మరణించగా, గురువారం విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. తాజాగా శుక్రవారం మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
గుర్లలో డయేరియా కారణంగా విజయనగరం, చీపురుపల్లి ఆసుపత్రుల్లో 40 మంది వరకూ చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా తయారైంది. ఇప్పటికే ఏడుగురు చనిపోగా, ఈ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదముందని తెలుస్తోంది. గ్రామంలో అతిసార వ్యాపించడంతో అధికారులు చర్యలు మొదలెట్టారు. తాగునీటి కలుషితం వల్లే అతిసార ప్రబలిందని డాక్టర్లు చెబుతున్నారు.