ప్రేమజంట ఆత్మహత్య
దారుణం జరిగింది.గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద రైలు పట్టాలపై ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. పెదకాకాని గ్రామానికి చెందిన దానబోయిన మహేశ్, నందిగామ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన నండ్రు శైలజ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. డిప్లమో పూర్తి చేసిన మహేశ్ హైదరాబాద్లోని ఓ మొబైల్ షాపులో పనిచేస్తున్నాడు. అక్కడే శైలజ పరిచయం అయింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇటీవల ఇరువురి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. పెళ్లి చేసుకునేందుకు మహేశ్ కుటుంబసభ్యులు అంగీకరించారు. అయితే శైలజ కుటుంబ సభ్యులు తమకు, ఈ వివాహం ఇష్టం లేదని తేల్చిచెప్పారు.
వారం కిందట ఇద్దరూ పరారయ్యారు. అంతలోనే శుక్రవారం రాత్రి పెదకాకాని సమీపంలోని రైలు పట్టాలపై శవాలై తేలారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం వల్లే ఘోరం జరిగిందని అనుమానిస్తున్నారు.