ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో భారతదేశానికి చెందిన మాజీ ఇంటెలిజెన్స్ అధికారిపై అమెరికా అభియోగాలు నమోదు చేసింది. ఆ ఆరోపణలను భారత్ ఖండించింది.
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర ఆరోపణలపై దర్యాప్తు చేస్తోన్న అమెరికా, దానికి సంబంధించి ‘రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్-రా’ మాజీ అధికారి వికాస్ యాదవ్ మీద కుట్ర కేసు నమోదు చేసింది. ఆ కేసులో ఇప్పటికే నిఖిల్ గుప్తా అనే భారతీయుడిపై అమెరికా అభియోగాలు మోపింది. తాజాగా పన్నూ హత్యకు వికాస్ యాదవే కుట్ర పన్నాడని ఆరోపించింది.
ఈ కేసుకు సంబంధించి భారత న్యాయశాఖ న్యూయార్క్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. వికాస్ యాదవ్‌పై మనీ లాండరింగ్, హత్య కుట్రకు వ్యక్తుల నియామకం, పన్నూ హత్యకు ప్రణాళిక వంటి అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు. వికాస్ గతంలో భారత విదేశీ ఇంటిలెజెన్స్ విభాగం, రా విభాగాన్ని నిర్వహించే కేబినెట్ సెక్రటేరియట్‌లో ఉద్యోగిగా పని చేసారు.
తమ గడ్డపై పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని భగ్నం చేసామనీ అమెరికా గతేడాదే ఆరోపించింది. భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూను హత్య చేసేందుకు నిఖిల్ గుప్తా కుట్ర పన్నారని తాజాగా ఆరోపించారు. ఈ కేసు వ్యవహారంపై అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు కూడా జారీ చేసింది.
అమెరికా ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. కేసు సమగ్ర విచారణ కోసం స్వదేశంలో దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసింది. అమెరికాలోని విదేశాంగ శాఖ, న్యాయశాఖ అధికారులతో సమావేశమైంది. ఆ బృందం పర్యటన ముగిసాకే వికాస్ యాదవ్‌పై అగ్రరాజ్యం అభియోగాలు మోపడం గమనార్హం.