గాజాలో తమ ఆపరేషన్స్‌లో ముగ్గురు ఉగ్రవాదులను తుదముట్టించామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ప్రకటించింది. వారిలో, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద దాడులకు సూత్రధారి అయిన హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకునేందుకు ఐడిఎఫ్, ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఐఎస్ఎ) దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతానికి హతులైన ఉగ్రవాదుల వివరాలను ఇజ్రాయెల్ అధికారికంగా ధ్రువీకరించలేదు.
గురువారం సాయంత్రం ఎక్స్ సామాజిక మాధ్యమంలో ఐడిఎఫ్ ప్రచురించిన పోస్ట్‌లో, ‘‘గాజాలో ఐడిఎఫ్ ఆపరేషన్స్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఒకరు యాహ్యా సిన్వర్ అవునా కాదా అన్న విషయాన్ని ఐడిఎఫ్, ఐఎస్ఎ పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతానికి ఆ ఉగ్రవాదుల ఉనికిని ధ్రువీకరించలేదు. ఉగ్రవాదులను తుదముట్టించిన భవనంలో ఎలాంటి బందీలూ ఉన్నట్లు తెలియరాలేదు. అక్కడ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్న బలగాలు తగిన జాగ్రత్తలతో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి’’ అని రాసుకొచ్చింది.
కొద్దిరోజుల క్రితమే లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ గగనతల దాడుల ద్వారా అంతమొందించింది. అంతకుముందు హమాస్ సీనియర్ నాయకుడు ఇస్మాయిల్ హనియే ఇరాన్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఆ దాడి వెనుక ఉన్నది ఇజ్రాయెలే అని ఇరాన్, హమాస్ ఆరోపించాయి కానీ ఇజ్రాయెల్ ఆ ఆరోపణలను అంగీకరించలేదు, అలాగని ఖండించనూ లేదు.
కొద్దిరోజుల క్రితం ఇజ్రాయెల్ రక్షణ బలగాలు, హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందిన పలువురు ఉన్నతాధికారులను హతం చేసింది. వారిలో గాజాలో హమాస్ ప్రభుత్వాధినేత రాహీ ముస్తాహా, హమాస్ పొలిట్‌బ్యూరోలో భద్రతా విభాగ అధిపతి సమే అల్ సిరాజ్ తదితరులు ఉన్నారు.
తాజాగా సోమవారం నాడు, జబాలియాలో జరిగిన భూ, వాయు మార్గాల్లో జరిగిన యుద్ధంలో సుమారు 20మంది హమాస్ ఉగ్రవాదులను హతమార్చినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. అదేరోజు ఒక ఆయుధాగారాన్ని, దానిలోని ఆయుధాలనూ నాశనం చేసారు కూడా.
‘‘గాజాపై మా ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఆ ప్రదేశంలోని ఉగ్రవాదుల స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసేవరకూ ఆ ప్రాంతంపై వ్యవస్థీకృతంగా దెబ్బలు పడుతూనే ఉంటాయి’’ అని ఇజ్రాయెల్ మిలటరీ వెల్లడించింది. అంతకుముందు, సోమవారం ఉత్తర గాజాలోని బీట్ హనూన్, జబాలియా, బీట్ లాహియా ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ పాలస్తీనా పౌరులకు పిలుపునిచ్చారు. ఆ ప్రాంతాలను వదిలిపెట్టడానికి గాజా దక్షిణభాగాన్ని వదిలిపెడుతున్నట్లు ప్రకటించింది. సదరు ‘హ్యుమానిటేరియన్ జోన్’ను మరింత విస్తరిస్తామని, గాజా ఉత్తరభాగంలోని సామాన్య పౌరులు ఖాళీ చేయిస్తున్నామనీ ఐడిఎఫ్ వెల్లడించింది.
ఇజ్రాయెల్ మిటలరీ కూడా పాలస్తీనా పౌరులకు గాజా వదిలిపెట్టి పోవడానికి సలా అద్దీన్ రోడ్, కోస్టల్ రోడ్ అనే రెండు రహదారులను తెరిచామని ప్రకటించింది.
అంతకుముందు, గాజా స్ట్రిప్‌లోని 70 హమాస్ స్థావరాలను గుర్తించిన ఇజ్రాయెల్‌కు చెందిన ఫైటర్ జెట్లు, మరో ఎయిర్‌క్రాఫ్ట్ ఆ ప్రాంతంలో దాడులు చేసామని ప్రకటించింది.