సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ గుడిపై దాడి చేసి అమ్మవారి విగ్రహాన్ని కూలదోసిన ఘటనకు పాల్పడిన వ్యక్తి సల్మాన్ సలీం ఠాకూర్ అని గుర్తించిన సంగతి తెలిసిందే. అతనికి వివాదాస్పద ముస్లిం బోధకుడు జకీర్ నాయక్ ప్రేరణ అని వెల్లడైంది.
సల్మాన్ సలీం ఠాకూర్ వివరాలు తెలియజేస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ ఒక ప్రకటన విడుదల చేసారు. ‘‘సల్మాన్ సలీం ఠాకూర్ అలియాస్ సల్మాన్ వయసు సుమారు 30 సంవత్సరాలు. అతను మహారాష్ట్ర ముంబై దగ్గర ముంబ్రా ప్రాంతానికి చెందినవాడు. అతను హైదరాబాద్‌కు అక్టోబర్ నెల మొదట్లో వచ్చాడు. ఇంగ్లీష్ హౌస్ అకాడమీ అనే సంస్థ నిర్వహిస్తున్న నెల రోజుల పెర్సనాలిటీ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి వచ్చాడు. దాని నిర్వాహకులు మునావర్ జమా, మహమ్మద్ కఫీల్ అహ్మద్ తదితరులు. సల్మాన్ సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లోని మెట్రోపోలిస్ హోటల్‌లో బసచేసాడు.’’
‘‘ఈ పెర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోర్సు నిర్వహణకు ఎలాంటి అనుమతులూ లేవు. దానిపేరిట హోటల్ ఆవరణను చట్టవిరుద్ధంగా అద్దెకు తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్వాహకుల మీద, హోటల్ యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము’’ అని పోలీసులు వివరించారు.
‘‘సల్మాన్ సలీం ఠాకూర్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో బి.ఇ చేసాడు. సోషల్ మీడియాలో క్రియాశీలంగా ఉంటాడు. పరారీలో ఉన్న జకీర్ నాయక్, తదితర ఇస్లాం మతబోధకుల వీడియోలను సల్మాన్ ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తుంటాడు. తద్వారా అతను అతివాద మానసిక స్థితికి చేరుకున్నాడు. ఇతర మతాల పట్ల ద్వేషం పెంచుకున్నాడు. ప్రత్యేకించి హిందువుల విగ్రహారాధన వంటి ఆచారాలంటే పూర్తిస్థాయిలో ద్వేషిస్తాడు’’ అని పోలీసులు స్పష్టం చేసారు.
ఇస్లాం బోధకుడు జకీర్ నాయక్ విద్వేష ప్రసంగాలు చేయడంలో దిట్ట. హిందువులకు వ్యతిరేకంగా ముస్లిములను రెచ్చగొట్టేలా విద్వేష ప్రసంగాలు చేస్తాడనీ, ఇస్లామిక్ అతివాదాన్ని సమర్ధిస్తాడనీ అతనిపై చాలా విమర్శలున్నాయి. అతని వివాదాస్పద ప్రసంగాలూ, అతివాదాన్ని ప్రోత్సహించే విధానం కారణంగా భారత అధికారులు అతనిపై దర్యాప్తు చేస్తున్నారు. చట్టపరంగా ఒత్తిడి పెరిగిపోవడంతో జకీర్ నాయక్ 2016లో భారత్ వదిలి మలేషియాకు పారిపోయాడు. అక్కడ అతనికి శాశ్వత నివాసానికి అనుమతి ఇచ్చారు. తద్వారా తన వేర్పాటువాద భావజాలాన్ని ప్రచారం చేస్తూ కూడా ప్రోసిక్యూషన్‌కు దొరక్కుండా తిరుగుతున్నాడు. అదే సమయంలో అతని ప్రభావంతో అతివాద శక్తులు రెచ్చిపోతున్నాయి.
హైదరాబాద్ పోలీసులు సల్మాన్ గురించి మరిన్ని వివరాలు తెలియజేసారు. ‘‘నిందితుడు గతంలో మహారాష్ట్రలోని ముంబైలో కూడా ఇటువంటి నేరాలకు పాల్పడ్డాడు. 2022లో ముంబైలో వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక గణేశ్ పండాల్‌లోకి చెప్పులతో ప్రవేశించి అక్కడి భక్తులను దూషిస్తూ వారి విగ్రహారాధన విధానాన్ని నిందించాడు. దానిమీద కేసు నమోదయింది. 2024 ఆగస్టు 1న ముంబైలోని మీరా-భయండర్ ప్రాంతంలో శ్రీ మనోకామనా సిద్ధి మహాదేవ మందిరంలోకి చొరబడి అక్కడ శివుడి విగ్రహాన్ని కాళ్ళతో తొక్కి హిందువుల మత విశ్వాసాలను అవమానించాడు. దానిపైనా కేసు నమోదయింది. అక్టోబర్ 14న సికింద్రాబాద్ కుమ్మరిగూడ లోని ముత్యాలమ్మ గుడి మీద దాడి చేసి హిందువుల్లో అశాంతిని రగిల్చాడు.’’
సల్మాన్ గురించి దర్యాప్తు జరుగుతోందని, ప్రజలు అనవసర ఊహాగానాలు మాని తమకు సహకరించాలనీ హైదరాబాద్ పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేసారు.