అక్టోబర్ 17న ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిచ్లో దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో వెడుతున్న రాంగోపాల్ మిశ్రా అనే యువకుణ్ణి సర్ఫరాజ్ అలియాస్ రింకూ అనే వ్యక్తి హత్య చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచీ పరారీలో ఉన్న సర్ఫరాజ్ ఇవాళ నేపాల్ సరిహద్దుల దగ్గర పోలీసులకు దొరికాడు. సర్ఫరాజ్, పోలీసుల మధ్య పరస్పర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ ఎన్కౌంటర్లో సర్ఫరాజ్ హతమైనట్లు తెలుస్తోంది. అతనితోనే ఉన్న మరో నిందితుడు తాలిబ్కు గాయాలయ్యాయి. చికిత్స కోసం అతన్ని బహ్రెయిచ్ వైద్య కళాశాలకు తరలించారు.
యూపీ ఏడీజీ అమితాభ్ యశ్ క్లుప్తంగా తెలియజేసిన వివరాల్లో ఎన్కౌంటర్ జరిగిందని, పలువురు నిందితులను అరెస్ట్ చేసామనీ ధ్రువీకరించారు. ‘‘మృతుల గురించి ఇంకా సమాచారం రాలేదు. కానీ పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసారు. ఎన్కౌంటర్లో ఇద్దరు గాయపడ్డారు’’ అని వెల్లడించారు.
దుర్గాపూజరోజు నిమజ్జనం ఊరేగింపుపై ముస్లిములు రాళ్ళదాడి చేసారు. ఆ సమయంలో సర్ఫరాజ్ అనే వ్యక్తి రాంగోపాల్ మిశ్రా అనే యువకుణ్ణి కాల్చి చంపాడు. అప్పటినుంచీ ఆ కేసులో నిందితులు పరారీలో ఉన్నారు. వారు ఇవాళ నేపాల్ పారిపోతున్నారని స్పెషల్ టాస్క్ఫోర్స్కు సమాచారం అందింది. పోలీసులు వారిని నన్పరా పోలీస్ స్టేషన్ పరిధిలోని హండా బసేహారీ కాలువ దగ్గర ఉండగా గుర్తించారు. పోలీసు బృందం వారిని సమీపిస్తున్న తరుణంలో నిందితులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు కూడా ప్రతికాల్పులు చేసారు. ఆ ఘటనలో సర్ఫరాజ్, తాలిబ్లకు తూటాలు తగిలాయి. సర్ఫరాజ్ సోదరుడు ఫహీమ్, తండ్రి అబ్దుల్ హమీద్, మరో గుర్తుతెలియని వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారు.