పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6(ఎ) రాజ్యాంగబద్ధమైనదే అని సుప్రీంకోర్టు ఇవాళ నిర్ధారించింది. ఆ సెక్షన్ ప్రకారం అస్సాంలో అక్రమ చొరబాటుదార్లను గుర్తించి బహిష్కరించేందుకు ప్రాతిపదిక సంవత్సరంగా (బేస్ ఇయర్) 1971 మార్చి 25నే కొనసాగించాలని ఆదేశించింది. ఈ చారిత్రక నిర్ణయాన్ని 4-1 తేడాతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదించింది. ఆ తేదీ తర్వాత భారత్‌లోకి చొరబడిన బంగ్లాదేశీయులు భారత పౌరసత్వానికి అర్హులు కాదని నిర్ధారించింది.
ఈ నిర్ణయం తీసుకున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్ అధ్యక్షత వహించారు. ప్రత్యేకించి సెక్షన్ 6(ఎ) ప్రకారం 1966 జనవరి 1 నుంచి 1971 మార్చి 25లోపు అస్సాంలోకి వచ్చిన బంగ్లాదేశీయులు తమను భారత పౌరులుగా రిజిస్టర్ చేసుకోడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఆ తర్వాత వచ్చిన వారికి భారత పౌరసత్వానికి అనుమతి మంజూరవదు.
ఈ నిర్ణయం తీసుకోడానికి కారణాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వివరించారు. ‘‘బంగ్లాదేశీయుల రాకడలు, ఆ ప్రాంతపు సంస్కృతిపై దాని ప్రభావమూ అస్సాంలో ఎక్కువగా ఉన్నాయ’ని చంద్రచూడ్ చెప్పుకొచ్చారు. బెంగాల్‌లో 57లక్షల మంది చొరబాట్ల కంటె అస్సాంలోకి 40లక్షల మంది చొరబాట్ల ప్రభావం ఎక్కువ’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సమయంలో భారత్‌లోకి తరలివచ్చిన మొత్తం జనాభా కంటె తూర్పు పాకిస్తాన్ నుంచి అస్సాంలోకి చొరబడిన జనసంఖ్యే ఎక్కువ అని స్పష్టం చేసారు. అందువల్ల 1971 మార్చి 25ను గడువుతేదీగా నిర్ధారించడాన్ని సమర్ధించారు.