తెలుగుదేశం పార్టీ మంగళగిరి ప్రధాన కార్యాలయంపై 2021 అక్టోబరు 21న జరిగిన దాడి కేసులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో సజ్జలను విచారించారు. సజ్జలతోపాటు న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్, బ్రహ్మారెడ్డి విచారణ గదిలోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. సజ్జలపై ఎలాంటి కేసులు లేవని పొన్నవోలు మీడియాకు తెలిపారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సజ్జలను విచారణకు పిలిచారని న్యాయవాది పొన్నవోలు విమర్శించారు. ఆధారాలు లేకుండా విచారణకు ఎలా పిలుస్తారంటూ ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంపై దాడికి సజ్జలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. పోలీసుల తీరును ఎండగట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గుంటూరుకు చెందిన పి. సతీష్ ఇప్పటికే పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే.