అస్సాంకు వలసవచ్చిన విదేశీయులు, భారతీయ పౌరులుగా నమోదు చేసుకోవడానికి అనుమతించే పౌరసత్వ చట్టంలోని నిబంధన చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది . పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 6ఏ, రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు అవుతుందని తీర్పు చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి డీ.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీతో ఈ తీర్పు వెల్లడించింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎంఎం సుందరేష్ , మనోజ్ మిశ్రా సహా మిగిలిన సమర్థించగా, జస్టిస్ జేబీ పార్దివాలా విభేదించారు.
సెక్షన్ 6ఏ ప్రకారం, విదేశీయులు పౌరసత్వం పొందినప్పటికీ 10 ఏళ్ళ వరకు వారిని ఓటరు జాబితాలో చేర్చడం కుదరదని జస్టిస్ పార్థీవాలా తీర్పులో పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఇతర ప్రాంతాలకు కూడా వర్తింపజేయవచ్చు అని తెలిపారు. అస్సాంలో 40 లక్షల మంది వలసదారులు ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో 57 లక్షల వలసదారులు ఉన్నారని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి మార్చి 25, 1971 నిర్ణీత తేదీ అనంతం ప్రవేశించిన వారిని అక్రమ వలసదారులుగా ప్రకటించారని, అందువల్ల వారికి సెక్షన్ 6 ఏ నిరుపయోగంగా ఉందని జస్టిస్ సూర్యకాంత్ తీర్పులో పేర్కొన్నారు.
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో 1955 పౌరసత్వ చట్టంలో సెక్షన్ 6ఏను చేర్చారు. 1966-1971 మధ్య భారత్‌లోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ వలసదారులకు పౌరసత్వాన్ని నిషేధించింది. వారికి ఓటు హక్కు కూడా నిరాకరించింది.