పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై తరచూ దాడులకు దిగుతోన్న హౌతీ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం బీ 2 స్టెల్త్ బాంబర్లుతో విరుచుకుపడింది. హౌతీ ఉగ్రవాదుల ఆయుధాగారాలే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు. హౌతీలు వారి ఆయుధాలు ఎంత లోతుగా దాచినా వదిలేదే లేదని ఈ దాడుల ద్వారా వెల్లడైందని లాయిడ్ స్పష్టం చేశారు.
అమెరికా తాజా దాడుల ద్వారా హౌతీలకు చెందిన ఆరు ఆయుధాగారాలు ధ్వంసం అయ్యాయని తెలుస్తోంది. పశ్చిమాసియాలో అమెరికా బీ2 స్టెల్త్ బాంబర్లను వినియోగించడం ఇదే మొదటి సారి. సాధారణ జెట్ ఫైటర్లతో విరుచుకుపడే అమెరికా తొలిసారి బీ2 స్టెల్త్ బాంబర్లను ప్రయోగించింది. ప్రపంచంలో ఎక్కడైనా బీ2 స్టెల్త్ బాంబర్లను ప్రయోగించగలమనే సంకేతాలను పంపినట్లైంది.