భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తదుపరి సీజేగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కేంద్రానికి పంపారు. ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్ ఖన్నా నియమితులు కానున్నారు.
నిబంధనల మేరకు ప్రతిపాదనను ప్రస్తుత సీజేఐ లేఖ రూపంలో కేంద్ర న్యాయశాఖకు పంపనున్నారు. ఆ లేఖను కేంద్ర న్యాయశాఖ, ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపాలి. ప్రధాని ఆమోదం ఆనంతరం రాష్ట్రపతికి చేరుకుంటుంది. అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు.
సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు. జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తర్వాత జస్టిస్ ఖన్నా అత్యంత సీనియర్‌గా ఉన్నారు. జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పదవీకాలం ఈ ఏడాది నవంబరు 11తో ముగిస్తుంది. నవంబరు 12న కొత్త సీజేఐ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సంజీవ్ ఖన్నా సీజేఐ పదవి చేపడితే ఆరు నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు. వచ్చే ఏడాది మే 13న ఆయన పదవీ విరమణ చేయనున్నారు.