రెండు దేశాల మధ్య స్నేహబంధమో, పొరుగుదేశంతో సత్సంబంధాలో లేకపోతే ఆ దేశం ఆత్మశోధన చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు.
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యదేశాల అధినేతల 23వ సమావేశంలో భారత్ తరఫున జయశంకర్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా జయశంకర్ ప్రసంగిస్తూ ‘‘ఈ సంస్థ ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటివరకూ పరిస్థితిని చూసుకుంటే, ఈ లక్ష్యాలు ఇవాళ మరింత కీలకంగా మారాయి. కాబట్టి మనం నిజాయితీగా మాట్లాడుకోవాలి’’ అని కుండ బద్దలుకొట్టారు.
‘‘విశ్వాసం లేకపోతేనో లేక సహకారం తగినంతగా లేకపోతేనో, స్నేహబంధం లోపిస్తేనో, ఇరుగుపొరుగు అన్న భావన కోల్పోతేనో దానికి తప్పకుండా ఆత్మశోధన చేసుకోవలసిన, పరిష్కరించుకోవలసిన కారణాలుంటాయి. (ఎస్‌సిఒ) ఒప్పందానికి మనం నిజాయితీగా కట్టుబడి ఉండాలన్న మాటమీద నిలబడగలిగితేనే పరస్పర సహకారం వల్ల కలిగే లాభాలను పూర్తిగా పొందగలుగుతాము’’ అని స్పష్టం చేసారు.
దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను, దేశాల ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాలనూ అడ్డుకునే మూడు దుష్టశక్తులు సీమాంతర ఉగ్రవాదం, అతివాదం, వేర్పాటువాదం అని జయశంకర్ తేల్చిచెప్పారు.
పరోక్షంగా పాకిస్తాన్‌ను ప్రస్తావిస్తూ జయశంకర్, సరిహద్దులకు ఆవలి కార్యకలాపాలను ఆ మూడు దుష్టశక్తులే ప్రభావితం చేస్తుంటే వాణిజ్యం, ఇంధనం, కనెక్టివిటీ, ప్రజల మధ్య సంబంధాలూ ఏమాత్రం బాగుండవు అని స్పష్టం చేసారు.
‘‘ప్రపంచం బహుళ-ధ్రువ ప్రపంచంగా మారుతోంది. ప్రపంచీకరణ, పునస్సమీకరణ అనేవి త్రోసిపుచ్చలేని నిజాలు. అదే సమయంలో వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, తదితర అంశాల్లో సహకారం ద్వారా కొత్త అవకాశాలను అవి కల్పిస్తున్నాయి. దాన్నే మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే మన ప్రాంతానికి ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఇతరులు కూడా మననుంచి స్ఫూర్తి పొందుతారు, అటువంటి ప్రయత్నాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు’’ అంటూ జయశంకర్ హితవు పలికారు.
‘‘అయితే దాన్ని సాధించడానికి… సహకారం అనేది పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వం ఆధారంగా ఉండాలి. ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్నీ గుర్తించాలి. దాని నిర్మాణం ఏకపక్ష అజెండాల మీద కాక నిష్కళంకమైన భాగస్వామ్యాల మీదనే జరగాలి’’ అని స్పష్టం చేసారు.
‘‘అభివృద్ధి, పురోగతి సాధించాలంటే శాంతి, సుస్థిరత ఉండాలి. అవి కావాలంటే మూడు దుష్టశక్తులను ఎదుర్కోడంలో రాజీపడకుండా దృఢంగా ఉండగలగాలి. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదం, అతివాదం, వేర్పాటువాద కార్యకలాపాలు జరుగుతుంటే సమాంతరంగా దేశాల మధ్య వాణిజ్యం, ఇంధన సరఫరా, కనెక్టివిటీ, అంతెందుకు, ప్రజల మధ్య సత్సంబంధాలను ఆశించడం కష్టం’’ అని చెప్పారు.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత, తాత్కాలిక కేటగిరీల్లో సంస్కరణల కోసం భారత్ పిలుపును జయశంకర్ పునరుద్ఘాటించారు. ఐరాసలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని, వర్ధమాన దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలనీ, అప్పుడే ఐరాస విశ్వసనీయత, దాని ప్రభావం సమర్థంగా ఉంటాయన్న సంగతిని ఎస్‌సిఒ సభ్యదేశాల నాయకులు 2024 జులైలో ఆస్టానాలో జరిగిన సమావేశంలో గుర్తించారని జయశంకర్ గుర్తుచేసారు.
రెండురోజుల ఎస్‌సిఒ సమావేశంలో పాల్గొనడానికి జయశంకర్ సోమవారం ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఈ ఉదయం ఆయనను పాకిస్తాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ స్వాగతం పలికారు. అంతకుముందు జయశంకర్ పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ ఒక మొక్క నాటారు.