ఆకాశ ఎయిర్, ఇండిగో సంస్థలకు చెందిన రెండు విమానాలకు ఇవాళ బాంబు బెదిరింపులు వచ్చాయి. దాంతో మొన్న సోమవారం నుంచీ ఇవాళ్టివరకూ అంటే 3 రోజుల్లో మొత్తం 12 విమానాలు బాంబు బెదిరింపులను ఎదుర్కొన్నాయి.
ఆకాశ ఎయిర్ విమానం బెంగళూరు వెళ్ళాల్సి ఉంది. ఆ విమానంలో 177మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఏడుగురు విమానసిబ్బంది కాగా ముగ్గురు పసిపిల్లలు. బెదిరింపు కాల్ తర్వాత విమానం ఢిల్లీకి వెనుదిరిగి వెళ్ళిపోయింది.
ఇండిగో విమానం ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళాల్సి ఉంది. బాంబు బెదిరింపు తర్వాత విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్ళించారు. అక్కడ విమానాన్ని ఖాళీ చేయించి, ప్రయాణికులను సురక్షితంగా తరలించినట్లు ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
మంగళవారం నాడు ఢిల్లీ-షికాగో ఎయిర్ ఇండియా విమానం, దామమ్-లఖ్‌నవూ ఇండిగో విమానం, అయోధ్య-బెంగళూరు ఎయిర్ ఇండియా విమానం, దర్భంగా-ముంబై స్పైస్‌జెట్ విమానం, బాగ్‌డోగ్రా-బెంగళూరు ఆకాశ ఎయిర్ విమానం, అమృత్‌సర్-డెహ్రాడూన్-ఢిల్లీ అలయన్స్ ఎయిర్ విమానం, మదురై-సింగపూర్ ఎయిర్ ఇండియా విమానం… మొత్తం ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
సోమవారం మస్కట్, జెడ్డా వెళ్ళవలసిన రెండు ఇండిగో విమానాలకు, ముంబై నుంచి న్యూయార్క్ వెళ్ళవలసిన ఒక ఎయిర్ ఇండియా విమానానికీ బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఇలా, ఈ మూడు రోజుల్లో 12 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం సంచలనాత్మకమైంది. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ స్థాయీసంఘం ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైంది. అంతకుముందు, పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మంత్రిత్వశాఖ, డీజీసీఏ అధికారులతో సమావేశం నిర్వహించారు.
బాంబు బెదిరింపుల వ్యవహారానికి సంబంధించి కొంతమంది నేరస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. డార్క్ వెబ్ ప్రమేయం కూడా ఉండి ఉంటుందని అనుమానిస్తున్నట్లు సమాచారం.