జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్‌లోని షేర్-ఇ- కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఒమర్ అబ్దుల్లాతో ప్రమాణస్వీకారం చేయించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ కు తొలి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా రికార్డుకెక్కారు.
ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఇండీ కూటమి నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఆప్ నేత సంజయ్ సింగ్, ఎన్సీపీ(శరద్ పవార్)ఎంపీ సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత డీ రాజా, సీపీఎం నేత ప్రకాశ్ కారత్ హాజరయ్యారు.
పదేళ్ళ తర్వాత జరిగిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమి 90 స్థానాలకు గానూ 49 స్థానాల్లో గెలిచింది. సింగిల్ గా పోటీ చేసిన బీజేపీ 29 సీట్లకే పరిమితమైంది.
కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న నేషనల్ కాన్ఫరెన్స్ ఏకంగా 42 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ కేవలం 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.