హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా నయాబ్ సింగ్ సైనీ ఎన్నికయ్యారు. పంచకులలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సైనీని శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో అక్టోబర్ 17(గురువారం) హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
హర్యానా శాసనసభ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 37 సీట్లలోనే విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా బీజేపీకే మద్దతు తెలిపారు. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సైనీని రెండోసారి సీఎంగా కొనసాగించాలని బీజేపీ నిర్ణయించింది. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన సైనీకి హోంమంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పార్టీ ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నికలకు ముందు మనోహర్ లాల్ ఖట్టర్‌ను సీఎం పదవి నుంచి తప్పించి బీజేపీ అధిష్టానం, బీసీ నేత అయిన నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రి చేసింది. పంచకులలో సైనీ, సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం చేయనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హాజరు కానున్నారు.