2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్లో అక్రమంగా రూ.240 కోట్లను షెల్ కంపెనీలకు తరలించారని ఆరోపిస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సిఐడి దర్యాప్తు చేపట్టి, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి, 52 రోజులపాటు జైలులో ఉంచిన కేసులో తిరిగి కదలిక ప్రారంభమైంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు బెయిల్ పై ఉన్నారు.
అప్పట్లో ఆ కేసు విచారణ ప్రారంభించిన ఈడీ రాష్ట్రంలో ప్రభుత్వం మారాక మౌనంగా ఉంది. తాజాగా ఆ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ కేసులో హైదరాబాద్ ఈడీ కార్యాలయం మంగళవారం రూ.23.54 కోట్ల మేర చర, స్ధిరాస్తుల్ని జప్తు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీఎస్ఎస్డీసీకి చెందిన సీమెన్స్ ప్రాజెక్టులో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆస్తుల జప్తు నిర్ణయం తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లో సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నిధుల దుర్వినియోగంపై ఈడీ దర్యాప్తు చేస్తోందని తెలిపింది.
ఈడీ దర్యాప్తులో డిజైన్ టెక్ సంస్థ ఎండీ ఖాన్విల్కర్ , సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, వారి సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్… బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి ప్రభుత్వ నిధుల్ని తమ షెల్ కంపెనీలలోకి మళ్లించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలిపింది. వారికి చెందిన స్థిర చరాస్తులు జప్తు చేసినట్లు వెల్లడించింది. గతంలో డిజైన్టెక్ సంస్ధకు చెందిన రూ.31.20 కోట్లను కూడా అటాచ్ చేసినట్లు గుర్తుచేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపింది.