తెలంగాణ హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) విద్యార్ధులు తమ నీచత్వాన్ని చాటుకున్నారు. ఆర్ఎస్ఎస్‌ను అవమానించాలనే దురుద్దేశంతో… స్వామి వివేకానంద, డాక్టర్ అంబేద్కర్‌ల బొమ్మలతో కూడిన సంఘ్ ప్రచార పోస్టర్లను యూనివర్సిటీ హాస్టల్‌లోని యూరినల్స్‌లో అంటించారు.
అక్టోబర్ 13 ఆదివారం నాడు యూనివర్సిటీలోని మెన్స్ హాస్టల్ హెచ్ బ్లాక్‌లోని యూరినల్స్‌లో ఈ నీచమైన చర్య చోటు చేసుకుంది. అంతేకాదు, ఈ సంఘటన వెలుగు చూసాక దాన్ని ఖండించకపోగా, ఎస్ఎఫ్ఐ ఏమాత్రం స్పందించలేదు సరికదా ఆర్ఎస్ఎస్, ఎబివిపి వంటి సంస్థల మీద నిరాధార ఆరోపణలు చేస్తూ అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. ఇది ఎస్ఎఫ్ఐ వంటి వామపక్షముఠాల పిరికితనాన్ని, కపటత్వాన్నీ బైటపెడుతోంది. వారి వ్యూహాత్మక మౌనం ఈ సంఘటన వెనుక ఎస్ఎఫ్ఐ పాత్ర ఉందనే అనుమానాలను మరింత బలపరుస్తోంది.
స్వామి వివేకానంద, డాక్టర్ అంబేద్కర్ యావత్ భారతావనిలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆదరాభిమానాలను చూరగొన్న మహానుభావులు. ఆధ్యాత్మిక ఐకమత్యం సాధించాలన్న వివేకానంద సందేశం, సామాజిక న్యాయం, సమానత్వాల కోసం అంబేద్కర్ అంకితభావం భారతదేశపు సంస్కృతికి, జీవాత్మకూ ప్రతిబింబాలు. వారి చిత్రాలను టాయిలెట్ యూరినల్స్‌లో అతికించడం ద్వారా ఆ మహానుభావులను అవమానించడమే కాదు, భారతదేశపు బహుళత్వ విలువలను ఎస్‌ఎఫ్ఐ దెబ్బకొట్టింది.
అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విభాగం ఆ చర్యను తీవ్రంగా ఖండించింది. ‘‘అవమానకరమైన ఆ చర్య, ఎస్ఎఫ్ఐ నైతికతా లోపాన్ని బహిర్గతం చేసింది. దుర్మార్గమూ అవమానకరమూ ఐన ఎస్‌ఎఫ్ఐ చేస్తున్న అటువంటి చర్యల ద్వారా ఆ మహానుభావుల విలువను తగ్గించలేరు. ఆ చర్య వారి కార్యకర్తల పిరికితనానికి నిదర్శనం. తమ జీవితాంతం అణగారిన బడుగు బలహీన వర్గాలను ఉద్ధరించడానికి కృషి చేసిన వారిని అవమానించడమే’’ అని మండిపడింది. అంబేద్కర్, వివేకానందలను అవమానించడం ద్వారా ఎస్ఎఫ్ఐ తమ నైజాన్ని బైటపెట్టుకోవడమే కాదు, నిర్మాణాత్మక చర్చలు జరపలేక గర్హనీయమైన కుయుక్తులకు పాల్పడుతోంది’’ అని ఎబివిపి ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఈ సంఘటన కంటె దానిమీద విమర్శలకు ఎస్ఎఫ్ఐ స్పందన మరింత ఆందోళనకరంగా ఉంది. ఎస్ఎఫ్ఐ ఒక నైతిక వైఖరి అవలంబించకుండా, ఆర్ఎస్ఎస్ మీద అసంబద్ధ ఆరోపణలు చేస్తూ అసలు గొడవకి సంబంధం లేని పోస్టర్లు విడుదల చేసింది. అసలు వ్యవహారం నుంచి దృష్టి మరల్చడానికి నిస్సిగ్గుగా చేసిన ప్రయత్నాలు, చేసిన పనికి బాధ్యత స్వీకరించడం నుంచి తప్పించుకునే వైఖరి, ఎస్ఎఫ్ఐ నిజరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి.
స్వామి వివేకానంద, డాక్టర్ అంబేద్కర్ బొమ్మలున్న పోస్టర్లను యూరినల్స్‌లో అంటించడం చిన్న తప్పేమీ కాదు. అది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య, జాతి సాంస్కృతిక, నైతిక పునాదులను అవమానించే లక్ష్యంతో జాగ్రత్తగా చేసిన నేరం. ఎస్ఎఫ్ఐ కపటబుద్ధిని, ద్వేషపూరిత అజెండాను, జాతికి గౌరవనీయులైన మహానుభావులను అవమానించే పద్ధతిని బాధ్యతాయుతమైన పౌరులు నిలదీయాలి.
ఇది క్యాంపస్ రాజకీయం స్థాయిని దాటిపోయిన చర్య. భారతదేశపు అస్తిత్వం కోసం, భారతీయ విలువల కోసం పోరాటం. అసహనం, అవమానం ఆధారంగా ఎస్ఎఫ్ఐ చేస్తున్న దుష్ట రాజకీయాలను తిరస్కరించాల్సిన తరుణమిది. సందేశం సుస్పష్టం. భారతదేశం గర్వించదగిన మహానుభావులను అవమానించడాన్ని, మన దేశపు విలువలను అపహాస్యం చేసే విభజనవాదాలను ఎంతమాత్రం అనుమతించకూడదు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి ఒకరు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం విభజనవాదులకు ఆటపట్టుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. పాలస్తీనాను విముక్తం చేయాలి, బాబ్రీ మసీదును పునర్నిర్మించాలి లాంటి రెచ్చగొట్టే రాతలు, పోస్టర్లతో యూనివర్సిటీ గోడలు నిండిపోయాయని వెల్లడించారు. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఆరోగ్యప్రదమైన అకడమిక్ చర్చలకు తావే లేదు, జాతీయ సమైక్యత, చారిత్రక చిత్తశుద్ధి వంటి విషయాలను పక్కకు నెట్టేసి విభజనవాదాలను ప్రోత్సహించే సిద్ధాంతాలను నెత్తికెత్తుకుంటున్నారని ఆ విద్యార్ధి ఆందోళన చెందారు.
ఆ సంఘటన తర్వాత విద్యార్ధులను హెచ్చరిస్తూ డీన్ కార్యాలయం ఒక లేఖ విడుదల చేసింది. ‘‘ఇతరులను అవమానించడం విశ్వవిద్యాలయ వ్యవస్థలో అనారోగ్యకర పరిణామం. విశ్వవిద్యాలయం సామాజిక, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతీ విద్యార్ధీ, ప్రతీ విద్యార్థి సంస్థా ఇతరులను గౌరవించాలి. ఈ అనైతిక చర్యకు పాల్పడిన దుండగుల చర్యలను మేము తీవ్రంగా నిశ్చితంగా ఖండిస్తున్నాము. ఈ సంఘటన చాలా తీవ్రమైన పరిణామం. దాని మీద ఉన్నతస్థాయి విచారణ జరుపుతాం. ఏమాత్రం సమర్ధించలేని ఇటువంటి ప్రవర్తన కలిగిన వారిని విశ్వవిద్యాలయం ఎంతమాత్రం సహించబోదు. అటువంటి పనులకు పాల్పడే విద్యార్ధులపై సస్పెన్షన్, బహిష్కరణ వంటి తీవ్రమైన చర్యలు తీసుకుంటాం’’ అని డీన్ ప్రకటించారు.
స్వామి వివేకానంద, అంబేద్కర్‌లను అవమానిస్తూ ఎస్ఎఫ్ఐ దుండగులు చేసిన దుశ్చర్యను వివేకానంద యూత్ ఫోరం ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీవ్రంగా ఖండించింది. ఇక ఎబివిపి సోమవారం (అక్టోబర్ 14) రాత్రి ‘మషాల్ జులూస్’ పేరిట కాగడాల ర్యాలీ నిర్వహించింది.