సికింద్రాబాద్ లో ముత్యాలమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్న పవన్ కళ్యాణ్, విగ్రహ ధ్వంసం దుర్మార్గమన్నారు. మహాపచారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అకృత్యాలు పునరావృతం కాకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో తన పేరిట లేఖను విడుదల చేశారు.
గడిచిన ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే తరహా ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. బంగ్లాదేశ్లో కూడా హిందూ దేవాలయాలను అపవ్రితం చేయడం అలవాటుగా మారిందన్నారు. ఇలాంటి దుర్మార్గాలపై అడ్డుకట్ట వేసేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి సభలో ప్రకటించిన వారాహి డిక్లరేషన్ లో కూడా ఇదే విషయాన్ని తాను వెల్లడించానని గుర్తు చేశారు.
సికింద్రాబాద్ కుమ్మరిగూడ ప్రాంత పరిధిలోని ముత్యాలమ్మ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. సనాతనులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.