నైరుతి రుతుపవనాలు భారత్ దేశ పరిధి నుంచి పూర్తిగా నిష్క్రమించగా, ఈశాన్య రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడగా వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మరింత బలపడనుంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిధిలోని దక్షిణాంధ్ర తీరంలో తుపాను ఏర్పడే అవకాశం ఉందని, మధ్య పశ్చిమ అరేబియా సముద్రంపై ఏర్పడిన అల్పపీడనం వచ్చే ఆరు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది. ఫలితంగా వచ్చే వారం రోజుల్లో కేరళలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా దేశంలోకి ప్రవేశించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతంకాగా, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటి పుదుచ్చేరి-నెల్లూరు మధ్య చెన్నైకి దగ్గరగా తీరం దాటనుంది.