కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ రెండు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ ఢిల్లీలో మీడియాకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసారు. మహారాష్ట్రలో ఒకే దశలోను, ఝార్ఖండ్‌లో రెండు దశల్లోనూ ఎన్నికలు జరుగుతాయి. వాటితో పాటే రెండు లోక్‌సభ స్థానాలకు, 48 శాసనసభ స్థానాలకూ ఉపయెన్నికలు కూడా జరుగుతాయి.
మహారాష్ట్రలో 288 శాసనసభా నియోజకవర్గాలున్నాయి. వాటన్నింటికీ ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరుగుతాయి.
ఝార్ఖండ్‌లో 81 శాసనసభా నియోజకవర్గాలున్నాయి. వాటిలో మొదటి దశలో 43 స్థానాలకు నవంబర్ 13న, రెండవ దశలో 38 స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరుగుతాయి.
కేరళలోని వయనాడ్ లోక్‌సభా స్థానానికి, దేశంలోని మరో 47 అసెంబ్లీ నియోజకవర్గాలకూ నవంబర్ 13న ఎన్నికలు జరుగుతాయి.
మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ స్థానానికి, ఉత్తరాఖండ్‌లోని ఒక అసెంబ్లీ స్థానానికీ నవంబర్ 20న ఎన్నికలు జరుగుతాయి.
ఈ అన్ని స్థానాల్లోనూ ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుంది.
మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ, శివసేన, ఎన్‌సిపిల సంకీర్ణం ‘మహాయుతి’ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ అసెంబ్లీ గడువు నవంబర్ 26తో ముగుస్తుంది. ఝార్ఖండ్‌లో జెఎంఎం-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ శాసనసభ గడువు 2025 జనవరి 5తో ముగుస్తుంది.